LOADING...
CDS Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం.. పాకిస్థాన్‌కు చురకలంటించిన సీడీఎస్ అనిల్ చౌహాన్ 
మాటలతో యుద్ధాలు గెలవలేం.. పాకిస్థాన్‌కు సీడీఎస్ అనిల్ చౌహాన్ చురక

CDS Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం.. పాకిస్థాన్‌కు చురకలంటించిన సీడీఎస్ అనిల్ చౌహాన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాటలతో యుద్ధాలు గెలవడం సాధ్యం కాదని, స్పష్టమైన చర్యల ద్వారానే విజయం సాధ్యమవుతుందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ (CDS Anil Chauhan) పాకిస్థాన్‌కు చురకలు అంటించారు. యువ అధికారులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమంలో సీడీఎస్ మాట్లాడారు. క్రమశిక్షణ, ముందస్తు ప్రణాళిక, వేగంగా, కచ్చితంగా నిర్ణయాలను అమలు చేయడం ద్వారానే అసలైన దృఢత్వం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ, తామే విజయం సాధించామని ఆ దేశం ప్రకటనలు చేసుకుంటోందని విమర్శించారు.

Details

భారత్‌కు స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది

ఈ నేపథ్యంలోనే సీడీఎస్ నుంచి ఈ ఘాటైన స్పందన వెలువడింది. బలహీనమైన వ్యవస్థల కారణంగా ప్రపంచంలోని పలు ప్రాంతాలు తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్నాయని, దాని ఫలితంగా తరచూ అభద్రత, ఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తుతున్నాయని పాకిస్థాన్‌కు కౌంటర్ ఇచ్చారు. 'అయితే భారత్‌కు స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. సాయుధ దళాల నైపుణ్యం, బలమైన వ్యవస్థలే దేశ బలం. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులను భారత బలగాలు సమర్థంగా అందిపుచ్చుకుంటున్నాయని చౌహాన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లోకి ప్రవేశించనున్న యువ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అలాగే దేశ సేవ కోసం తమ పిల్లలను అంకితమిచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Details

విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదు

'ఈ అకాడమీలో క్యాడెట్లకు అత్యుత్తమ శిక్షణ లభించింది. విధుల్లో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. ఎవరు చేసే తప్పులకు వారే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఒకప్పుడు యుద్ధాలు క్షేత్రస్థాయిలో మాత్రమే జరిగేవని, ప్రస్తుతం మాత్రం సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుందని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని యువ అధికారులకు సూచించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా గట్టిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది.

Advertisement