LOADING...
Hyderabad Water Board: నీటి వృథాపై జలమండలి ఉక్కుపాదం.. రిజర్వాయర్ల వద్ద బల్క్ ఫ్లో మీటర్లు
రిజర్వాయర్ల వద్ద బల్క్ ఫ్లో మీటర్లు

Hyderabad Water Board: నీటి వృథాపై జలమండలి ఉక్కుపాదం.. రిజర్వాయర్ల వద్ద బల్క్ ఫ్లో మీటర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. ప్రస్తుతం 35 శాతానికి పైగా నీరు వృథా అవుతున్న నేపథ్యంలో పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రిజర్వాయర్ల వద్ద అత్యాధునిక బల్క్ ఫ్లో వాటర్ మీటర్లను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా నీటి సరఫరాపై పూర్తి స్థాయి పర్యవేక్షణతో పాటు వృథాను తగ్గించడంపై దృష్టి సారించనుంది. జలమండలి పరిధిలో తాగునీటి సరఫరా కోసం మొత్తం 691 రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా రిజర్వాయర్లకు ఎంత మేర నీరు చేరుతోందన్న వివరాలు ఉన్నప్పటికీ, ఆ నీటిలో ఎంత మేర వినియోగదారులకు చేరుతోంది, ఎంత నీటికి బిల్లింగ్ జరుగుతోంది,ఎంత నీరు లెక్కల్లోకి రాకుండా వృథా అవుతోందన్న అంశాలపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

వివరాలు 

రిజర్వాయర్ల వద్ద బల్క్ ఫ్లో మీటర్ల ఏర్పాటు

కొన్ని డివిజన్లలో జలమండలి అంచనాల ప్రకారం 50 శాతానికి పైగా నీరు వృథా అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వాయర్ల వద్ద బల్క్ ఫ్లో మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే ఈ పరికరాలు రిజర్వాయర్ల నుంచి విడుదలయ్యే నీటి పరిమాణాన్ని కచ్చితంగా నమోదు చేస్తాయి. ఆ వివరాల ఆధారంగా చివరి వినియోగదారుడి వరకు ఎంత నీరు చేరుతోంది,ఎంత నీటికి బిల్లింగ్ జరుగుతోందనే అంశాలను విశ్లేషించనున్నారు. దీంతో పైప్‌లైన్ లీకేజీలు, అక్రమ నీటి కనెక్షన్లు, బిల్లుల పరిధిలోకి రాని నీటి వినియోగం వంటి సమస్యలను స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సరఫరా వ్యవస్థలోని లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టనున్నారు.

వివరాలు 

35 శాతానికి పైగా నీటి వృథా నమోదవుతున్న డివిజన్లపై ప్రత్యేక దృష్టి

అలాగే అక్రమ కనెక్షన్ల విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు జలమండలి సిద్ధమవుతోంది. జలమండలి గణాంకాల ప్రకారం లెక్కల్లోకి రాని నీటి శాతం రెండో డివిజన్‌లో అత్యధికంగా ఉండగా, ఆ తర్వాత మొదటి, మూడో, నాలుగో డివిజన్లు ఉన్నాయి. 35 శాతానికి పైగా నీటి వృథా నమోదవుతున్న డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించి, నీటి నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నారు.

Advertisement