Godavari: గోదావరి వద్ద నీటిమట్టం 47 అడుగులు, రెండో ప్రమాద హెచ్చరికకు సర్వం సిద్ధం
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. సోమవారం 26 అడుగులుగా ఉన్న నీటిమట్టం, ఈ రోజు మధ్యాహ్నం వరకు 47 అడుగులకు చేరుకుంది. ఇక మరో గంటలో గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఉదయం 7:30 గంటలకు గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది.
పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు బంద్
గత 24 గంటల్లో గోదావరి నీటిమట్టం 20 అడుగులకు పైగా పెరిగడం విశేషం. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో, నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించింది. శబరి ఉపనది ఉధృతంగా ప్రవహించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం పరిసర ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.