Pattiseema: పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదితో అనుసంధానం చేసి రాష్ట్రంలో నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మోటార్లను ప్రారంభించి పోలవరం కుడి ప్రధాన కాలవలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 మధ్యకాలంలో సుమారు రూ.1,300 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్రానికి ఇప్పటివరకు దాదాపు రూ.50 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు.
వివరాలు
గత ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును సరిగా వినియోగించలేదు: నిమ్మల
ఈ ప్రాజెక్టును గతంలో ప్రతిపక్షం 'వట్టిసీమ' అంటూ విమర్శించిందని, అయితే ప్రస్తుతం ఇదే పథకం ద్వారా ఇప్పటికే 450 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించామని చెప్పారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. దూరదృష్టి, ముందుచూపు, నిర్మాణాత్మక ఆలోచనలతో కూడిన నాయకత్వం ఉంటే ప్రజలకు ఎంతటి ప్రయోజనం కలుగుతుందో పట్టిసీమ ప్రాజెక్టు స్పష్టంగా నిరూపిస్తోందని నిమ్మల రామానాయుడు అన్నారు. గత ప్రభుత్వానికి పాలనా అనుభవం, అభివృద్ధిపై దృష్టి, దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడం వల్లే పట్టిసీమ ప్రాజెక్టును సరిగా వినియోగించలేదని ఆయన విమర్శించారు.
వివరాలు
వరద జలాలను పట్టిసీమ ద్వారా ఒడిసిపట్టి కృష్ణా డెల్టాకు..
ప్రస్తుతం కర్ణాటకలోని ఆలమట్టి నుంచి నాగార్జునసాగర్ వరకు ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకున్నాయని మంత్రి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాలు సముద్రంలో కలిసిపోకుండా వాటిని పట్టిసీమ ద్వారా ఒడిసిపట్టి కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి ధర్మరాజు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.