Revanth Reddy: బీఆర్ఎస్‌ను బతికించుకునేందుకు మళ్లీ నీళ్ల సెంటిమెంట్.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ చేసిన ఒక సంతకమే నేడు ఆంధ్రప్రదేశ్‌కు అడ్వాంటేజ్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వినియోగించుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు 299 టీఎంసీలే సరిపోతాయని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు. 'నీళ్లు-నిజాలు' అంశంపై ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాజీ సీఎం కేసీఆర్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు.
Details
రూ.80వేల కోట్లకు పెంచారని ఆరోపణ
కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వ్యయాన్ని రూ.30 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెంచారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ నీటి సమస్యలపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాము ఏపీ ప్రభుత్వానికి మౌనంగా సహకరిస్తున్నామనే తప్పుడు సమాచారాన్ని కావాలనే వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి మేడిగడ్డకు తరలించడంతో ప్రాజెక్టు వ్యయం రూ.1.40 లక్షల కోట్లకు చేరిందని ఆరోపించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించే ముందు కేసీఆర్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా సిద్ధం చేయలేదని అన్నారు.
Details
తన
రాజకీయ లబ్ధి కోసం పక్క రాష్ట్రాన్ని దూషించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసిన సీఎం, గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకే తమ ప్రయత్నమన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయించారని, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అని లెక్కలు వేశారని తెలిపారు. తెలంగాణకు 34 శాతం సరిపోతుందని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్, హరీశ్ రావులు సంతకం చేశారని విమర్శించారు. ఆ సంతకమే తెలంగాణకు శాశ్వత నష్టంగా మారిందని, ఏపీకి అడ్వాంటేజ్‌గా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఓపిక లేని వ్యక్తి చేసిన తప్పిదమిదని సీఎం అన్నారు.
Details
కేసీఆర్ ను కసబ్ తో పొల్చుతూ వ్యాఖ్య
తెలంగాణ నీటి వాటాల విషయంలో కేసీఆర్, హరీశ్ రావులు చేసిన తప్పులకు తీవ్ర శిక్ష పడినా తప్పులేదని వ్యాఖ్యానించిన సీఎం, ఇదే తప్పు మధ్యప్రాచ్య దేశాల్లో జరిగి ఉంటే ప్రజలే శిక్షించేవారని అన్నారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదికీ ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ జరిపామని వ్యాఖ్యానిస్తూ, కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కేసీఆర్‌కు అపారమైన వనరులు, న్యాయవాదుల బలముందని కూడా వ్యాఖ్యానించారు. పార్టీని నిలబెట్టుకునేందుకు కేసీఆర్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని, చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ తెలంగాణలో బీఆర్ఎస్‌ను తిరిగి బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Details
కేసీఆర్ గౌరవానికి ఎలాంటి భంగం కలిగించలేదు
ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తమవల్ల కేసీఆర్ గౌరవానికి ఎలాంటి భంగం కలిగించలేదని, సూచనలు-సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఎక్కడైనా తప్పు చేస్తే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గతంలో జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, కనీసం ఆ పని అయినా కేసీఆర్ చేయాలని హితవు పలికారు. ఇదిలా ఉండగా, సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బేసిన్లపై సీఎంకు ప్రాథమిక అవగాహన కూడా లేదన్నది బహిరంగ సత్యమని విమర్శించారు.
Details
అసభ్య, అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం
బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ మధ్య తేడా కూడా సీఎంకు తెలియదని ఆరోపించారు. ఒకవైపు సభకు వస్తే కేసీఆర్‌ను అవమానించమని చెబుతూనే, అదే ప్రెస్‌మీట్‌లో కసబ్‌తో పోల్చడం అనాగరికమని అన్నారు. అసభ్య భాష, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని నటిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను, తనను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని వ్యాఖ్యానించడం హద్దులు దాటిన వ్యవహారమని అన్నారు. గోదావరి బనకచర్ల అంశంపై నిజంగా సుప్రీంకోర్టులో పోరాడతామని చెబితే, ఢిల్లీ సమావేశానికి ఎందుకు వెళ్లారని, కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రజలకు ఎందుకు తెలియజేయలేదని నిలదీశారు. కమిటీ వేయడమే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడమని విమర్శించారు.
Details
సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని హరిష్ రావు వ్యాఖ్య
కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని సీఎం చెబితే, రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే మొత్తం 811 టీఎంసీల పునర్విభజన కోసం లేఖ ఎందుకు రాశారని ప్రశ్నించారు. సెక్షన్-3 ద్వారా కృష్ణా జలాల పునర్విభజన జరిపిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతోనే కేసును ఉపసంహరించుకున్న విషయాన్ని దాచిపెట్టి గోబెల్స్ తరహా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సాధనతో పాటు తొమ్మిదేళ్ల పోరాటంతో సెక్షన్-3 కింద కృష్ణా జలాల పునర్విభజన సాధించి రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన మహనీయుడు కేసీఆర్ అని హరీశ్ రావు కొనియాడారు. అలాంటి నాయకుడిని విమర్శించడం సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని వ్యాఖ్యానించారు.