LOADING...
Madhya Pradesh: మళ్లీ కలకలం రేపిన పుచ్చకాయ.. మధ్యప్రదేశ్‌లో వ్యక్తి మృతి
మళ్లీ కలకలం రేపిన పుచ్చకాయ.. మధ్యప్రదేశ్‌లో వ్యక్తి మృతి

Madhya Pradesh: మళ్లీ కలకలం రేపిన పుచ్చకాయ.. మధ్యప్రదేశ్‌లో వ్యక్తి మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని ముంబయిలో ఇటీవల బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఓ కుటుంబ సభ్యులు కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో పుచ్చకాయ కారణం కాదని అనంతర దర్యాప్తులో తేలింది. ఇదే తరహాలో తాజాగా మధ్యప్రదేశ్‌లో మరో విషాద ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే తండ్రీకొడుకులు తీవ్ర అస్వస్థతకు గురికాగా, తండ్రి మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. మధ్యప్రదేశ్‌లోని షాజాపుర్ జిల్లాకు చెందిన 43 ఏళ్ల ఇంద్ర కుమార్ షియోపుర్ ప్రాంతంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఆయనతో పాటు కుమారుడు వినోద్‌ (21) అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం వారిద్దరూ పుచ్చకాయ తిన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

వివరాలు

ఈ ఘటనపై స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు దర్యాప్తు

అనంతరం వారి ఆరోగ్యం ఒక్కసారిగా మరింత విషమించిందని చెప్పారు. వారి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఇంద్ర కుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కోటాకు తరలించాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రికి తీసుకెళ్తున్న మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందాడు. మరోవైపు కుమారుడు వినోద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. అయితే పుచ్చకాయ తినడం వల్లే ఈ ఘటన జరిగిందా అనే అంశాన్ని వైద్యులు ఇంకా నిర్ధారించలేదు. ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా వీరు అస్వస్థతకు గురై ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటనపై స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement