Priyanka Gandhi: ఓట్ల దొంగతనంపై గాంధీలా పోరాటం చేస్తున్నాం : ప్రియాంకా గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలా పోరాడుతున్నామని కాంగ్రెస్ అగ్రనేత్రి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్‌లో నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో మహాత్మాగాంధీ పోరాడిన హక్కులే ప్రమాదంలో ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైన హక్కు ఓటు హక్కు అని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. 'పౌరుల హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగాన్ని బలహీనపరిచే దిశగా బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ, మహాఘట్‌బంధన్ పోరాటం.. అప్పట్లో మహాత్మాగాంధీ చేసిన యుద్ధంలాంటిదే. మనం నేడు సత్యం కోసం, ప్రజల హక్కుల కోసం నరేంద్ర మోడీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ప్రియాంకా గాంధీ అన్నారు.
Details
రూ.10వేలు ఇస్తున్నారని మోసపోవద్దు
ప్రధాని నరేంద్ర మోడీ గూండాల భాషలో మాట్లాడుతున్నారని, అలాంటి భాష దేశ ప్రధానికి తగదని ఆమె విమర్శించారు. మతం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 'రూ.10,000 ఇస్తున్నారు కదా అని ఎవరూ మోసపోవద్దు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా? ఎన్నికల ముందు మాత్రమే ఇస్తున్నారు. ఇది ఓట్ల లంచం. మహిళల బాధలను పురుషులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దేశంలోని పరిశ్రమలను ఇద్దరు స్నేహితుల చేతుల్లో పెట్టిందని ప్రియాంకా విమర్శించారు.
Details
243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
'కాంట్రాక్టు పనులన్నీ వారికే దక్కుతున్నాయి. దేశ ఆస్తులు నాశనమయ్యాయి. నితీష్ కుమార్ చేతుల్లో అధికారం ఏమీ లేదు. అంతా ఢిల్లీ నుంచే నియంత్రణలో ఉందని ఆమె పేర్కొన్నారు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న పూర్తయ్యింది. 121 స్థానాల్లో 65.08 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1951 తర్వాత అత్యధిక పోలింగ్ శాతంగా నమోదయింది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న 122 నియోజకవర్గాల్లో జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య కఠిన పోటీ నెలకొంది