Loading...
Mallikarjun Kharge: జ్ఞానేశ్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుంటాం.. ఖర్గే సంచలన హెచ్చరిక!
జ్ఞానేశ్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుంటాం.. ఖర్గే సంచలన హెచ్చరిక!

Mallikarjun Kharge: జ్ఞానేశ్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుంటాం.. ఖర్గే సంచలన హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా ఇండియా కూటమి నిర్వహించిన 'ఓట్ బచావో.. దేశ్ బచావో' మహాసభ భారీ జనసందోహం మధ్య జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ప్రజలు, విద్యార్థులు, రైతులు, విపక్ష పార్టీల కార్యకర్తలతో మైదానం కిక్కిరిసిపోయింది. ఈ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదితర విపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం పనితీరుపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

వివరాలు

మోదీ, అమిత్ షాపై ఖర్గే తీవ్ర ఆరోపణలు

ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఓట్ల చోరీ ఆరోపణలు, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ప్రస్తావిస్తూ కేంద్రంపై మండిపడ్డారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి మహిళలు, దళితులు, యువత ఓట్లను దొంగిలించేందుకు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పనిచేస్తూ ఓట్ల చోరీకి సహకరిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.

వివరాలు

విపక్షాలను భయపెట్టాలని చూస్తున్నారు

''జ్ఞానేశ్ కుమార్ భూమిపై ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుంటాం'' అంటూ హెచ్చరించారు.

మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల తీర్పుతో అధికారంలోకి రాలేదని ఆయన ఆరోపించారు.

సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించి విపక్షాలను భయపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

అయితే ఇలాంటి చర్యలకు తాము భయపడి వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీని గద్దె దించితేనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT

వివరాలు

ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై రాహుల్ ఆగ్రహం

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

ఢిల్లీలో విపక్ష నేతలు చేపట్టిన మార్చ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఈ నిరసనలకు భయపడి కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను బలవంతంగా మూసివేయించిందని రాహుల్ ఆరోపించారు.

వ్యాపారులను భయపెట్టి ప్రజాస్వామ్య గొంతును నొక్కాలని చూస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది పేర్లను తొలగించడం ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

ఇలాంటి ప్రయత్నాలను సాగనివ్వబోమని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

ADVERTISEMENT

వివరాలు

డబుల్ ఇంజిన్ సర్కార్.. ఇప్పుడు డబుల్ జీరో: అఖిలేశ్

ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇప్పుడు 'డబుల్ జీరో'గా మారిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో 1.27 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించారని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన తర్వాతే ఈ విషయం వారికి అర్థమైందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.

వివరాలు

ఓటు చోరులపై మహాభారతం: తేజస్వి యాదవ్

రామ్‌లీలా మైదానంలో సాధారణంగా రామాయణ గాథలు వినిపిస్తాయని, కానీ ఇప్పుడు ఓటు చోరులకు వ్యతిరేకంగా మహాభారతం జరుగుతోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు.

కేంద్ర పాలకులు శకుని మాదిరిగా అక్రమ పావులు కదుపుతున్నారని విమర్శించారు. వారికి తగిన బుద్ధి చెప్పేందుకు ఈ మైదానాన్ని కురుక్షేత్రంగా మారుస్తామని హెచ్చరించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాని మోదీకి కీలుబొమ్మగా అభివర్ణించారు.

రాజ్యాంగ పదవుల్లో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

వివరాలు

సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్

ఈ మహాసభలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ తదితరులు ప్రసంగించారు.

దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, రాజకీయ భవిష్యత్తును మార్చేందుకు కుట్ర జరుగుతోందని విపక్ష నేతలు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.

వివరాలు

బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలి

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని విపక్ష నాయకులు డిమాండ్ చేశారు.

ఎన్నికల అక్రమాల ఆరోపణలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావడానికి ఈ మహాసభ కీలకంగా నిలుస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణతో పాటు ఓటర్ల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT