PM Modi: రూల్స్ ఫాలో కాదు.. మనమే సెట్ చేద్దాం.. బ్రిక్స్ దేశాలకు మోదీ కీలక పిలుపు..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ సంక్షోభాల విషయంలో 'గ్లోబల్ సౌత్ దేశాలు (Global South)' ముందు వరుసలో ఉన్నప్పటికీ.. నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుక వరుసలో ఉండిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇకపై గ్లోబల్ సౌత్ దేశాలు కేవలం నిబంధనలు పాటించేవిగానే కాకుండా.. నియమాలను రూపొందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భిన్నత్వమే బ్రిక్స్ దేశాల (BRICS Countries) బలమని అన్నారు. దిల్లీలోని భారత మండపంలో జరుగుతోన్న బ్రిక్స్ వార్షిక సదస్సు (BRICS 2026)లో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నిరంతరం ఘర్షణలు పెరుగుతున్నాయని మోదీ అన్నారు. వాటి ప్రభావం సామాన్యుల జీవితాలపై పడుతోందని పేర్కొన్నారు. ఇలాంటి సవాళ్లను సకాలంలో గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు.
వివరాలు
అంటు వ్యాధులపై ముందస్తు హెచ్చరిక
అంటువ్యాధులపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటుపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు.
పరస్పర సహకారంతో ప్రపంచ దేశాలు మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే దేశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సమయంలో పర్యావరణానికి ఇబ్బంది కలిగించకూడదని మోదీ సూచించారు.
అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను పరస్పర విరుద్ధమైన లక్ష్యాలుగా చూడకూడదని స్పష్టం చేశారు.
భారతీయ నాగరికత ఎప్పటినుంచో ప్రకృతిని తల్లిగా భావిస్తూ.. మానవాభివృద్ధికి, పర్యావరణానికి మధ్య సమతుల్యతను పాటిస్తోందని వివరించారు.
ఇది భవిష్యత్తు తరాల పట్ల మన బాధ్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు.
వివరాలు
బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలి
అన్ని దేశాలు కలిసి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ (BRICS Fund)ను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు.
ప్రత్యేకంగా స్టార్టప్‌ల కోసం నిధులు అందుబాటులో ఉండటం వల్ల బ్రిక్స్ దేశాల్లోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తల మధ్య మరింత సహకారం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.
వివరాలు
జిన్‌పింగ్ సమక్షంలోనే అరుదైన ఖనిజాలపై మోదీ వ్యాఖ్యలు
సాంకేతికతను, సంక్లిష్ట ఖనిజాలను చూపి బెదిరింపులకు పాల్పడటాన్ని వ్యతిరేకించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఇలాంటి చర్యలు సమష్టి వృద్ధికి అడ్డంకులు సృష్టిస్తాయని పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అరుదైన ఖనిజాలపై చైనా(China)ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(Xi Jinping)అక్కడే ఉండడం గమనార్హం.
ప్రపంచంలోని అరుదైన ఖనిజాల్లో సుమారు 90 శాతాన్ని చైనానే ప్రాసెస్ చేస్తుంది. సోలార్ ప్యానెళ్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌ల వరకు అనేక ఉత్పత్తుల్లో ఈ ఖనిజాలను ఉపయోగిస్తారు.
గతేడాది అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో.. ఈ అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా నిబంధనలను కఠినతరం చేసింది. ఆ తర్వాత ఆ ఆంక్షల్లో కొన్నింటిని సడలించింది.