Pm Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలు… భారత్‌కు సవాళ్లు: మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత్‌కు అనేక సవాళ్లను తెచ్చిపెడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ అంశంపై నేడు లోక్‌సభలో మాట్లాడిన ఆయన, గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. అక్కడి పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. యుద్ధ ప్రభావంతో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తున్నామని వెల్లడించారు. అలాగే దేశంలో ఎల్‌పీజీ కొరత తలెత్తకుండా చూడటం తమ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.
వివరాలు
పశ్చిమాసియా ప్రాంతంలో దాదాపు కోటిమంది భారతీయులు
పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోందని మోదీ పేర్కొన్నారు. ఈప్రభావం భారత్‌పైనా కనిపిస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా మన దేశానికి గల్ఫ్ ప్రాంతం నుంచే ఎక్కువగా ముడి చమురు, సహజ వాయువు సరఫరా అవుతుండటంతో పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని చెప్పారు. యుద్ధం కారణంగా ఇతర దేశాలతో వాణిజ్య కార్యకలాపాలు కూడా అంతరాయం చెందుతున్నాయని వివరించారు. అలాగే పశ్చిమాసియా ప్రాంతంలో దాదాపు కోటిమంది భారతీయులు నివసిస్తున్నారని గుర్తుచేశారు. వాణిజ్య నౌకల్లో కూడా అనేకమంది భారతీయులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భారత రాయబార కార్యాలయాలు అక్కడి ప్రజలకు సాధ్యమైనంత సహకారం అందిస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఆ ప్రాంత దేశాధినేతలతో రెండుసార్లు మాట్లాడినట్లు మోదీ తెలిపారు.
వివరాలు
3.75 లక్షల మంది భారతీయులు స్వదేశానికి
ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతీయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 3.75 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు చెప్పారు. అదేవిధంగా సుమారు వెయ్యిమంది విద్యార్థులు కూడా తిరిగి వచ్చారని తెలిపారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఇప్పటికే రద్దు చేసినట్లు చెప్పారు. పశ్చిమాసియా పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని సహాయ చర్యలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
వివరాలు
41 దేశాల నుంచి ఇంధనం దిగుమతి
దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన సరఫరాదారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలో 27 దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారత్, ప్రస్తుతం 41 దేశాలకు ఆ పరిధిని విస్తరించిందని వెల్లడించారు. అలాగే దేశంలో ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని, వాటిని 65 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మోదీ వివరించారు.