ఒంట్టిమిట్ట సీతారాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి?
ఒంటిమిట్టలో బుధవారం జరిగే సీతా రాముల కల్యాణానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీతా రాముల కల్యాణం వేడుకకు సీఎం జగన్ ఎందుకు గైర్హాజరయ్యారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీ పార్టీ వర్గాలు మాత్రం సీఎం జగన్ కాలు బెణికిందని, అందుకే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెబుతున్నారు. కారణం చాలా చిన్నగా కనిపిస్తున్న నేపథ్యంలో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీరామ నవమి వేడుకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఒంటిమిట్ట చాలా కీలకం
సీఎం జగన్ బుధవారానికి సంబంధించి అపాయింట్ మెంట్ ఏదీ రద్దు చేసుకోలేదు. ఆయన ఉదయం కొత్తగా నియమితులైన క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాస్ రాజును కలిశారు. ఆయనతో కలిసి బయటకు వచ్చారు. అలాగే గురువారం చిలకలూరిపేట పర్యటన షెడ్యూల్ కూడా ఖాయమైంది. అక్కడ జరిగే బహిరంగ సభకు జగన్ హాజరు కానున్నారు. అయితే ఒంటిమిట్ట పర్యటనను మాత్రమే జగన్ ఎందుకు రద్దు చేసుకున్నారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం తెలంగాణకు వెళ్లిన తర్వాత, శ్రీరామ నవమి వేడుకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఒంటిమిట్ట చాలా ముఖ్యమైనది. అందుకే సీఎం జగన్ గైర్హాజరును ప్రతిపక్షాలు బూతద్దంలో పెట్టి చూస్తున్నాయి.