ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం దిల్లీ వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో గురువారం ఉదయం సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని కోరారు.
అమిత్ షాతో సీఎం జగన్ భేటీ ముఖ్యాంశాలు
అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థిక, ఆదాయం, అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్‌చాలా నష్టపోయిందని అమిత్ షాకు జగన్ వివరించారు. విభజన జరిగి 9ఏళ్లు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే వీటిపై దృష్టి పెట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు రూ.10వేల కోట్ల గ్రాంట్‌ను విడుదల చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అనూహ్య వరదల కారణంగా పోలవరం వద్ద డయాఫ్రమ్ పాడైందని, మరమ్మతులకోసం రూ.2020 కోట్లు అవసరమవుతాయని డీడీఆర్‌ఎంపీ అంచనా వేసిన నేపథ్యంలో విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సాంకేతిక సలహా కమిటీ అంచనాలు రూ. 55,548 కోట్లు కాగా, ఈ మొత్తానికి తక్షణమే ఆమోదించాలని జగన్ అభ్యర్థించారు.