Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్
వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయాన్నే సీఎం జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార వైఎస్సార్సీపీ నుంచి ఏడుగురు, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నుంచి ఒకరు బరిలో నిలవడంతో పోరు రతవత్తరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా, వైఎస్సార్‌సీపీకి 151 మంది, టీడీపీకి 23 మంది, జనసేనకు ఒక సభ్యుడు ఎన్నికల్లో గెలిచారు. అయితే ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచిన నలుగురు సభ్యులు మాత్రం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాగే జనసేన సభ్యుడు కూడా పార్టీని వీడారు.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేస్తారా?
ఒక్కో ఎమ్మెల్సీ గెలుపునకు 22మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత నేపథ్యంలో ఏడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. టీడీపీకి ఒక్క సీటు కూడా గెలిచేంత బలం లేదు. అయిబా అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీలో వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవచ్చని భావిస్తున్న రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని టీడీపీ భావిస్తోంది. దీంతో ఇరు పార్టీలు విప్ జారీ చేసిన నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల ఒటింగ్ సరిళి ఎలా ఉంటుందో అని సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.