West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంపై మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా రామభక్తులు, సాధారణ హిందూ ప్రజలు, తమ నాయకులపై కొందరు హింసకు పాల్పడ్డారని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ లేఖ రాశారు. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరడం గమనార్హం.
టీఎంసీ మద్దతు లేకుండా ఈ హింస జరగదు: బీజేపీ
సుకాంత మజుందార్ తను రాసిన లేఖలో ఏం పేర్కొన్నారంటే, సోమవారం సాయంత్రం హుగ్లీ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో భారీ రాళ్ల దాడి జరిగిందని, ఈ క్రమంలో రాళ్లను కూడా నిలిపేశారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ మద్దతు లేకుండా ఈ హింస జరగదని ఆయన చెప్పారు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మనోజ్ మాలవ్య ఆధ్వర్యంలోని పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కరువైందన్నారు. తనకు దూరమవుతున్న మైనారిటీ ఓటు బ్యాంకు కోసం నేరస్తులను, దేశ వ్యతిరేక శక్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు.