ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం
కోల్‌కతాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికను ఆదివారం ఆమె పొరుగింటికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పొరుగింటి వారి ఫ్లాట్‌లోని సూట్‌కేస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతాలోని శ్రీధర్ రాయ్ రోడ్‌లో నివసిస్తున్న బాలిక ఆదివారం తెల్లవారుజామున కనిపించకుండా పోయింది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిలజాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భవనంలోని మొత్తం 32ఫ్లాట్లలో పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. కానీ బాలిక ఆచూకీ లభించలేదు.
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
బాలిక పక్కనే ఉన్న భవనంలోకి ప్రవేశించడం సీసీటీవీలో కనిపించినట్లు స్థానికులు చెప్పారు. పక్కింట్లో పోలీసుల ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులతో పాటు స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఇదే సమయంలో సాయంత్రం పక్కనే తాళం వేసి ఉన్న ఇంటిపై అనుమానం వచ్చింది. ఇంటి తాళం పగలగొట్టి వెతకగా, సూట్‌కేస్‌లో బాలిక మృతదేహం కనిపించింది. అలోక్‌కుమార్ ఫ్లాట్‌లోని రెండో అంతస్తులో మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ధృవీకరించారు. బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అలోక్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయగా, అతను హత్య చేసినట్లు అంగీకరించారు.