Ayodhya: 1949లో బాబ్రీ మసీదులో లభించిన శ్రీరాముడి విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
Old Ram Idol: అయోధ్యలో రామాలయాన్ని సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. కర్ణాటకలోని బ్లాక్ గ్రానైట్ తో చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. ఈ క్రమంలో 1949లో బాబ్రీ మసీదులో బయటపడ్డ శ్రీరాముడి పాత విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ ప్రశ్నకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి సమాధానం చెప్పారు. ఇన్నాళ్లు టెంట్ కింద పూజల అందుకున్న శ్రీరాముడి పాత విగ్రహాన్ని.. కొత్త విగ్రహం ముందు ఉంచుతామని చెప్పారు. పాత విగ్రహం కోసం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహం సమీపంలోనే సింహాసనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పాత విగ్రహానికి కూడా నిత్య పూజలు, హారతి, నైవేద్యాలను సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
కొన్ని ఆచారాలను పూర్తి చేసిన తర్వాత గర్భగుడిలోకి పాత విగ్రహం
రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. కొన్ని ఆచారాలను పూర్తి చేసిన తర్వాత.. శ్రీరాముడి పాత విగ్రహాన్ని గుడారం నుంచి ప్రధాన ఆలయానికి తీసుకువస్తారని చెప్పారు. 1949లో బాబ్రీ మసీదు గోపురం కింద శ్రీరాముడి విగ్రహం కనిపించినట్లు అప్పట్లో ప్రత్యేక్షంగా చూసిన సాక్ష్యులు చెప్పారు. ఈ ఘటన రామ జన్మ భూమి వివాదాన్ని తారా స్థాయికి తీసుకెళ్లింది. హిందూ పక్షం వారు బాబ్రీ మసీదు గోపురం కింద శ్రీరాముడి విగ్రహాన్ని అదే ప్రాంతంలో కొలవడం ప్రారంభించారు. 1992డిసెంబర్ 6న బాబ్రీ గోపురం కూల్చివేయడంతో కాంప్లెక్స్ లోనే తాత్కాలిక టెంట్ వేసి శ్రీరాముడి విగ్రహానికి పూజలు చేశారు. అప్పుటి నుంచి శ్రీరాముడి విగ్రహం టెంట్ కిందే పూజలు అందుకుంటోంది.