LOADING...
Mayday Call: అహ్మదాబాద్ ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా పైలట్ జారీ చేసిన "మేడే" కాల్ ఏమిటి?
అహ్మదాబాద్ ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా పైలట్ జారీ చేసిన "మేడే" కాల్ ఏమిటి?

Mayday Call: అహ్మదాబాద్ ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా పైలట్ జారీ చేసిన "మేడే" కాల్ ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
06:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమాన ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ వినిపించే పదం 'మేడే' కాల్‌. 'మేడే' కాల్‌కు ఒక ప్రత్యేకమైన,లోతైన అర్థం ఉంది. 'మేడే' అనే పదం ఫ్రెంచ్ భాషలోని 'మాయిడెజ్‌' (m'aider) అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం "నన్ను కాపాడండి" లేదా "నాకు సహాయం అవసరం" అన్నమాట. ఇది అంతర్జాతీయంగా వాయుమార్గ (ఎవియేషన్‌),సముద్ర మార్గ (మారిటైమ్‌) కమ్యూనికేషన్‌లలో అత్యవసర సందర్భాల్లో ఉపయోగించే అత్యంత అత్యవసర రేడియో సంకేతంగా వ్యవహరిస్తారు.

వివరాలు 

 "మేడే, మేడే, మేడే" అని మూడుసార్లు పిలవడం ఎమర్జెన్సీని సూచిస్తుంది

విమానంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు,పైలట్ "మేడే, మేడే, మేడే" అని మూడుసార్లు పిలవడం ద్వారా ఎమర్జెన్సీని సూచిస్తారు. ఇది విమానానికి ఇంజిన్‌ విఫలం కావడం,అగ్ని ప్రమాదం,నియంత్రణ కోల్పోవడం లేదా అకస్మాత్తుగా కేబిన్‌లో గాలిరాహిత్య పరిస్థితి (డీకంప్రెషన్‌) వంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడినట్లు తెలియజేస్తుంది. ఈ కాల్‌ వచ్చిన వెంటనే, విమాన నియంత్రణ కేంద్రం (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ - ATC) రేడియో ట్రాఫిక్‌ను నిలిపివేసి అత్యవసర ప్రోటోకాల్స్‌ అమలుకు తక్షణమే సిద్ధమవుతుంది. విమానం ప్రమాదంలో ఉన్నట్టుగా కనిపించినపుడు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠినమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ప్రోటోకాల్స్‌ను అమలు చేయాల్సిందిగా నిర్దేశిస్తుంది.

వివరాలు 

ఈ అత్యవసర పరిస్థితి ప్రకటన మూడు దశల్లో జరగుతుంది: 

INCERFA - అనిశ్చిత పరిస్థితి (instability), ALERFA - అప్రమత్తత స్థితి (alert phase), DETRESFA - ప్రాణాపాయ పరిస్థితి (distress). ఇవాటిలో 'మేడే' కాల్‌ DETRESFA కిందకు వస్తుంది. అది అత్యంత సంక్లిష్టమైనది. మేడే కాల్‌ వచ్చిన వెంటనే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మిగిలిన విమాన ట్రాఫిక్‌ను తొలగించి, మేడే పిలిచిన విమానంతో నేరుగా కమ్యూనికేషన్‌ లోకి వెళ్తారు. వెంటనే ఎయిర్‌పోర్ట్‌ ఎమర్జెన్సీ సేవలతో సమన్వయం చేస్తారు. అవసరమైతే సమీప ఎయిర్ బేస్‌ల సహకారాన్ని కూడా తీసుకుంటారు.

వివరాలు 

విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక ఆధారాలు ఇవే..

ఏఆర్‌ఎఫ్‌ఎఫ్‌ (ARFF)-ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ యూనిట్లు,విమాన ప్రమాదాలకు స్పందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వీటిలో క్రాష్ టెండర్లు,అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు ఉంటాయి. ఇవన్నీ రన్‌వే లేదా విమాన మార్గం సమీపంలో తక్షణ స్పందనకు సిద్ధంగా ఉంచబడతాయి. ఎమర్జెన్సీ సేవల సమన్వయం : విమాన ప్రమాదానికి స్పందించే క్రమంలో,పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది,వైద్య బృందాలు,నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సహా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా చురుకుగా పని చేయడం ప్రారంభిస్తాయి. వీటితో పాటు, విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక ఆధారాలైన ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR), 'కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR)'ను సేకరించడం ప్రారంభిస్తారు. ఇవి చివరి క్షణాల్లో ఏమి జరిగింది అన్న దానిని పునఃనిర్మించడంలో కీలకంగా ఉపయోగపడతాయి.