Nitish kumar: మరో వివాదంలో బిహార్ సీఎం.. హిజాబ్ పైకెత్తి.. వైద్యురాలి మొహంలోకి చూసి
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పట్నాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ మహిళ హిజాబ్‌ను లాగారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్,ఆర్జేడీ నేతలు దీనిని ఆయన మానసిక స్థితిని ప్రతిబింబించే చర్యగా విమర్శిస్తున్నారు. సోమవారం పట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో,ఒక వైద్యురాలికి ఆయుష్ సర్టిఫికెట్ ను ముఖ్యమంత్రి నీతీశ్ చేత్తో అందజేశారు. ఈ సమయంలో,సర్టిఫికెట్ ను ఇచ్చే సందర్భంలో, డాక్టర్ ముఖంపై ఉన్న హిజాబ్ ను ఆయన కొంతవరకు తొలగించారు. సీఎం చర్యకు మహిళ స్పందించనప్పటికీ.. నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయారు. అదే స్టేజీపై ఉన్న కొందరు నవ్వుతూ కనిపించారు
వివరాలు
నీతీశ్‌కు పూర్తిగా మతిభ్రమించినట్లు ఉందంటూ విమర్శలు
ఆ సమయంలో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి, సీఎం చర్యను ఆపేందుకు ప్రయత్నిస్తున్న విధానం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను తీవ్రంగా విమర్శించింది. నీతీశ్‌కు పూర్తిగా మతిభ్రమించినట్లు ఉందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మహిళల పట్ల జేడీయూ- భాజపా సంకీర్ణ ప్రభుత్వ వైఖరి ఏంటో ఈ ఉదంతం తెలియజేస్తోందంటూ ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ పేర్కొన్నారు. గత బిహార్ ఎన్నికల సమయంలో కూడా, ఓ మహిళ మెడలో పూలదండ వేసిన సందర్భంలో ఆయన విధానం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ సంఘటనలతో పాటు, ఈ విధమైన చర్యలు ఆయన మానసిక స్థితిపై అనుమానాలను ఏర్పరుస్తున్నాయి.