
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లు అంటే ఏమిటి?.. బిల్లు పూర్వాపరాలు ఇవే.
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిచ్చే "వక్ఫ్ సవరణ బిల్లు-2025" ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిల్లుపై చర్చ ప్రారంభమవుతుంది. రేపు రాజ్యసభలో కూడా చర్చ కొనసాగనుంది.
ప్రతీ సభలో చర్చించేందుకు 8 గంటల సమయం కేటాయించారు.
వక్ఫ్ చట్ట అభివృద్ధి - మార్పులు & సవరణలు
1954లో తొలిసారిగా వక్ఫ్ చట్టం పార్లమెంట్ ఆమోదించింది. అనంతరం, 1995లో ఈ చట్టాన్ని రద్దు చేసి వక్ఫ్ బోర్డులకు మరింత అధికారం కల్పిస్తూ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అపరిమిత అధికారం వక్ఫ్ బోర్డులకు కల్పిస్తూ మరోసారి చట్టాన్ని సవరణ చేసింది.
వివరాలు
బిల్లులో కీలక రానున్న మార్పులు
ప్రస్తుతం ప్రవేశపెడుతున్న వక్ఫ్ సవరణ బిల్లు-2025 ను "యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫీసియెన్సీ, అండ్ డెవలప్‌మెంట్ (ఉమీద్) బిల్లు" గా పేర్కొంటారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. రైల్వే, ఆర్మీ తర్వాత ఇదే అత్యధిక స్థాయిలో భూసంపదను కలిగి ఉంది.
ఈ చట్టం ద్వారా డిజిటలైజేషన్,సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, పారదర్శకతను పెంపొందించడం,అలాగే అక్రమంగా ఆక్రమించబడిన వక్ఫ్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు న్యాయ, చట్టపరమైన వ్యవస్థలను రూపొందించడం వంటి కీలక సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు.
ఈ బిల్లును 2024 వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌కు తీసుకురాగా, విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కి పంపించారు.
వివరాలు
వివాదాస్పద ప్రతిపాదనలు.. విమర్శలు
JPC మొత్తం 14 సవరణలను ఆమోదించగా, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన 44 సవరణలను తిరస్కరించింది.
ఈ బిల్లులో కీలకమైన మార్పుగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేర్చడం తప్పనిసరి చేయడం ప్రతిపాదించారు.
దీని వల్ల సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ & రాష్ట్ర వక్ఫ్ బోర్డుల కూర్పు మారనుంది, అయితే ఇది వక్ఫ్ బోర్డుల స్వతంత్రతను దెబ్బతీస్తుందని విమర్శలు వస్తున్నాయి.
ఇంతకాలం ఒక ఆస్తి వక్ఫ్‌దే అని వక్ఫ్ బోర్డు నేరుగా క్లెయిమ్ చేసేది,దీని వల్ల వివిధ రాష్ట్రాల్లో వివాదాలు ఏర్పడేవి.
అయితే,కొత్త చట్టం ప్రకారం యాజమాన్య హక్కులను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి నిర్ణయిస్తారు.
బిల్లు ప్రకారం,ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఫలితంగా, వివాదాల పరిష్కారంలో తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అవుతుంది.