
NGT: భారతదేశంలో 13వేల చదరపు కి.మీ అటవీ భూమి ఆక్రమణ.. ఎన్జీటీకీ సమర్పించిన నివేదికలో కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా 2024 నాటికి ఆక్రమణకు గురైన మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 13,056 చదరపు కిలోమీటర్లు అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT)కు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
ఈ విస్తీర్ణం దిల్లీ,సిక్కిం,గోవా రాష్ట్రాల మొత్తం భూభాగం కంటే ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది.
అటవీ భూముల ఆక్రమణపై పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంకా పూర్తి సమాచారం వెల్లడించలేదని నివేదిక పేర్కొంది.
దేశవ్యాప్తంగా అటవీ భూములు అక్రమంగా ఆక్రమించబడుతున్నాయనే అంశాన్ని స్వప్రేరితంగా స్వీకరించిన NGT, ఈ మేరకు 2023లోనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలోని ఆక్రమణ వివరాలను సమర్పించాలంటూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
ఆక్రమణ వివరాలను సమర్పించిన రాష్ట్రాలు
కేంద్ర మంత్రిత్వ శాఖ సమర్పించిన తాజా నివేదిక ప్రకారం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, దాద్రానగర్ హవేలీ & దమణ్‌దీవ్, కేరళ, లక్షద్వీప్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, సిక్కిం, మధ్యప్రదేశ్, మిజోరం, మణిపూర్ వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అటవీ భూముల ఆక్రమణ వివరాలను సమర్పించాయి.
ఇంకా సమాచారం ఇవ్వాల్సిన రాష్ట్రాలు
బిహార్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, దిల్లీ, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ వంటి రాష్ట్రాలు ఇంకా తగిన వివరాలను సమర్పించాల్సి ఉంది.
వివరాలు
అత్యధిక ఆక్రమణకు గురైన రాష్ట్రాలు
మధ్యప్రదేశ్ - 5,460 చదరపు కిలోమీటర్లు, అస్సాం - 3,620 చదరపు కిలోమీటర్లు, కర్ణాటక - 863.08 చదరపు కిలోమీటర్లు, తమిళనాడు - 157.68 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ - 133.18 చదరపు కిలోమీటర్లు.
పూర్తి సమాచారాన్ని పట్టిక రూపంలో సమర్పించాలని కోరుతూ, ఇంకా వివరాలు పంపని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇటీవల లేఖలు పంపినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ NGTకు తెలియజేసింది.