Page Loader
Hyderabad Metro: హైదరాబాద్‌లో అర్ధరాత్రి 12 వరకు మెట్రో సేవలు.. ఆలస్యంగా వెళ్లేవారికి తీపి కబురు! 
హైదరాబాద్‌లో అర్ధరాత్రి 12 వరకు మెట్రో సేవలు.. ఆలస్యంగా వెళ్లేవారికి తీపి కబురు!

Hyderabad Metro: హైదరాబాద్‌లో అర్ధరాత్రి 12 వరకు మెట్రో సేవలు.. ఆలస్యంగా వెళ్లేవారికి తీపి కబురు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 02, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రయాణికుల సంఖ్య గత కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రోజువారీ ప్రయాణికుల సంఖ్య సగటున 5 లక్షల వద్దనే ఉంది. ఈ సంఖ్యను 7 లక్షలకు చేరేలా చేయడం ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఆదాయాన్ని పెంచుకొని నష్టాలను తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. ప్రయాణికుల సంఖ్యను, ఆదాయాన్ని పెంచేందుకు మెట్రో సేవల వేళలను పొడిగించడం కీలకమని చూస్తోంది. మెట్రో సేవల సమయాన్ని పొడిగించాలని ప్రయాణికులు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. నిరంతరం క్రియాశీలంగా ఉండే హైదరాబాద్‌లో కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.

Details

రాత్రి షిఫ్ట్ ఉద్యోగులకు ఊరట!

గత రెండేళ్లుగా దీనిపై తర్జనభర్జన పడుతోంది. రైళ్ల రాకపోకలు, ట్రాక్‌ నిర్వహణకు తగిన సమయం లేకపోవడం వల్ల ఇప్పటివరకు వెనుకడుగు వేసినా, తాజాగా ఏప్రిల్‌ 1 నుంచి మెట్రో సమయాన్ని పొడిగించింది. నగరం నడిబొడ్డున ఉన్న అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ అర్ధరాత్రి 12 గంటలవరకు అన్ని దిశలలో మెట్రో రైళ్లను అందుబాటులో ఉంచుతోంది. ఈ నిర్ణయం ఆలస్యంగా విధులు ముగించుకునే ఉద్యోగులకు, దూరప్రాంతాలకు ప్రయాణించే వారికి, రాత్రి షిఫ్ట్‌లలో పని చేసే వారికి ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ మార్పులతో పాటు సంస్థ టికెట్‌ ఛార్జీలను సవరించేందుకు కూడా కసరత్తు చేపట్టింది. పెరిగిన టోకు ధరల సూచీల మేరకు ఛార్జీల పెంపుపై అధ్యయనం చేస్తోంది.

Details

 మెట్రో నిర్వహణకు కేవలం 3 గంటల సమయం 

అయితే మెట్రో యాక్ట్‌ ప్రకారం, ఛార్జీ పెంపుపై నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మెట్రో రైళ్ల నిర్వహణ, ఓవర్‌హాలింగ్‌, ట్రాక్‌ల సంరక్షణ కోసం కేవలం 3 గంటల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. రాత్రి 11.45 గంటలకు చివరి మెట్రోలు టర్మినల్‌ స్టేషన్ల నుంచి బయలుదేరి గమ్యస్థానాలకు చేరే సరికి అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది. ఉదయం 6 గంటలకు మొదటి మెట్రో సేవలు ప్రారంభం కావాల్సినందున, రైళ్లు డిపోల నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరాలి. ఫలితంగా, మెట్రో నిర్వహణ, ట్రాక్‌ మెయింటెనెన్స్‌, కోచ్‌ల ఓవర్‌హాలింగ్‌ కోసం కేవలం 3 గంటల సమయం మాత్రమే మిగులుతుందని సంస్థ వెల్లడించింది.