LOADING...
India-US trade deal: భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ ఇచ్చిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ఎవరు?
భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ ఇచ్చిన సెర్గియో గోర్.. ఎవరు?

India-US trade deal: భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ ఇచ్చిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ఎవరు?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై సాగుతున్న చర్చల్లో కొంతకాలంగా కొనసాగిన ప్రతిష్టంభనకు తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో బ్రేక్ పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెర్గియో గోర్ (Sergio Gor)పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో భారత్‌లో అమెరికా రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన గోర్‌, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు,వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తానని అప్పుడే స్పష్టం చేశారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లు,ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్‌-అమెరికా సంబంధాల్లో కొంత ఉద్రిక్తతను తీసుకురాగా, రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే ఆ పరిస్థితిని సర్దుబాటు చేయడంలో గోర్ కీలకంగా వ్యవహరించారు. ఇరుదేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహమే ఈ ఒప్పందానికి పునాది అని ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

వివరాలు 

ట్రంప్ పరిపాలనలో సెర్గియో గోర్‌ కీలక స్థానం

ఇకపై భారత్‌-అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. 39 ఏళ్ల సెర్గియో గోర్‌ ట్రంప్‌కు అత్యంత విధేయుడిగా పేరుగాంచారు. అదే కారణంగా తక్కువ సమయంలోనే ట్రంప్ పరిపాలనలో కీలక స్థానం దక్కించుకున్నారు. వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందిన గోర్‌ను భారత్‌కు అమెరికా రాయబారిగా, దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల పర్యవేక్షకుడిగా నియమించడం అప్పట్లో దౌత్యవర్గాల్లో సంచలనం రేపింది. ఆయన నియామకంపై భారత్‌లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అయితే ట్రంప్ మాత్రం, "నా అజెండాను అమలు చేయడానికి పూర్తిగా నమ్మదగిన వ్యక్తి నాకు కావాలి. ఆ విషయంలో సెర్గియో అత్యుత్తమ రాయబారిగా నిలుస్తాడు" అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.

వివరాలు 

గోర్ కు 'మేయర్ ఆఫ్ మార్-ఎ-లాగో' బిరుదు

1990లలో గోర్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. ఆయన తల్లిదండ్రులకు రష్యా మూలాలు ఉన్నాయి. అమెరికాకు వచ్చిన కొద్దికాలానికే గోర్‌కు పౌరసత్వం లభించింది. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో చదివిన ఆయన,2008లో పొలిటికల్ సైన్స్‌,అంతర్జాతీయ వ్యవహారాల్లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రారంభం నుంచే రిపబ్లికన్ పార్టీలో చురుకుగా ఉన్న గోర్‌,రిపబ్లికన్ నేషనల్ కమిటీలో కమ్యూనికేషన్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పని చేశారు. 2020లో ట్రంప్ పాలన సమయంలో విక్టరీ ఫైనాన్స్ కమిటీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులవడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఆ తర్వాత ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిన గోర్‌కు 'మేయర్ ఆఫ్ మార్-ఎ-లాగో' అనే బిరుదు కూడా దక్కింది. మార్-ఎ-లాగో అనేది ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్ రిసార్ట్‌గా ప్రసిద్ధి.

Advertisement

వివరాలు 

వైట్‌హౌస్‌లో పర్సనల్ డైరెక్టర్‌గా పనిచేసిన గోర్

భారత్‌కు రాయబారిగా నియమితులయ్యే ముందు గోర్ వైట్‌హౌస్‌లో పర్సనల్ డైరెక్టర్‌గా పనిచేశారు. ట్రంప్ రాజకీయ అజెండాకు అనుగుణంగా కీలక నిర్ణయాలను అమలు చేయడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంది. తాజాగా మీడియాతో మాట్లాడిన గోర్‌, ట్రంప్‌-భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న స్నేహబంధం వాస్తవమేనని పేర్కొన్నారు. తమకు భారత్ అత్యంత ప్రాధాన్య దేశమని స్పష్టం చేశారు. దీనికి నిదర్శనంగా పాకిస్తాన్‌, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్‌పై విధించిన సుంకాలు తక్కువగా ఉండటం గమనార్హమని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement