Rohan Naidu: హైదరాబాదీ ఖగోళవేత్త రోహన్ నాయుడు అరుదైన ఆవిష్కరణ.. వెలుగులోకి బ్లాక్ హోల్ స్టార్!
ఈ వార్తాకథనం ఏంటి
ఖగోళ శాస్త్రంలో మరో ఆసక్తికరమైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన యువ శాస్త్రవేత్త రోహన్ నాయుడు నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. ఇప్పటివరకు శాస్త్ర ప్రపంచానికి తెలియని ఓ సరికొత్త ఖగోళ వస్తువును గుర్తించింది. దీనికి 'బ్లాక్ హోల్ స్టార్' (కృష్ణబిల నక్షత్రం) అని పేరు పెట్టారు. నాసా ప్రయోగించిన అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది. దీనికి సంబంధించిన పరిశోధన కథనం ప్రముఖ 'నేచర్' సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
వివరాలు
ఏమిటీ 'బ్లాక్ హోల్ స్టార్'?
పరిశోధకులు గుర్తించిన ఈ వింత ఖగోళ వస్తువుకు 'MoM-BH*-1'గా పేరు పెట్టారు. ఇది సెటస్ నక్షత్రరాశిలో ఉన్నట్లు గుర్తించారు.
మహావిస్ఫోటనం (బిగ్ బ్యాంగ్) జరిగిన సుమారు 66 కోట్ల సంవత్సరాల తర్వాత ఇది ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాల్లో ఇది అత్యంత ఎర్రగా కనిపించే చిన్న చుక్కలా దర్శనమిచ్చింది.
దీని నిర్మాణం కూడా సాధారణ నక్షత్రాలకు భిన్నంగా ఉంది. దీని కేంద్రంలో సూర్యుడి ద్రవ్యరాశితో పోలిస్తే ఏకంగా లక్ష రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన కృష్ణబిలం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ కృష్ణబిలం చుట్టూ మన సౌర వ్యవస్థ పరిమాణంలో దట్టమైన వాయువుల పొర ఆవరించి ఉంది.
వివరాలు
ఏమిటీ 'బ్లాక్ హోల్ స్టార్'?
సాధారణ నక్షత్రాలు కేంద్రక సంలీన చర్య (న్యూక్లియర్ ఫ్యూజన్) ద్వారా శక్తిని, కాంతిని ఉత్పత్తి చేస్తాయి.
అయితే ఈ 'బ్లాక్ హోల్ స్టార్' విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. దీని ప్రకాశానికి కారణం కేంద్రంలోని కృష్ణబిలం నుంచి వెలువడే శక్తేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీని కాంతి సాధారణ నక్షత్రం కంటే సుమారు 100 బిలియన్ రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు.
బయట కనిపించే దట్టమైన వాయువుల పొర వల్ల ఇది నక్షత్రంలా కనిపిస్తున్నప్పటికీ.. దాని వెనుక ఉన్న శక్తి మాత్రం కేంద్రంలోని కృష్ణబిలమే.
వివరాలు
విశ్వం తొలి దశ రహస్యాలకు కీలక ఆధారం
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విశ్వం తొలిదశకు సంబంధించిన చిత్రాలను పంపినప్పుడు.. అందులో అనేక 'లిటిల్ రెడ్ డాట్స్'(చిన్న ఎర్ర చుక్కలు)కనిపించాయి.
విశ్వం ఆరంభ దశలో ఇవి పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ.. ప్రస్తుత విశ్వంలో మాత్రం దాదాపుగా కనిపించడం లేదు.
అసలు ఈ ఎర్రటి చుక్కలు ఏమిటన్నది శాస్త్రవేత్తలకు చాలాకాలంగా అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.
తాజాగా రోహన్ నాయుడు బృందం గుర్తించిన'బ్లాక్ హోల్ స్టార్స్'.. నాటి 'లిటిల్ రెడ్ డాట్స్'లో ఒక భాగం కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ ఆవిష్కరణ ద్వారా గెలాక్సీల కేంద్రాల్లో కనిపించే మహాకాయ కృష్ణబిలాలు(Supermassive Black Holes)ఎలా ఏర్పడ్డాయి?అవి ప్రారంభ విశ్వంలో ఇంత వేగంగా ఎలా పెరిగాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
హైదరాబాద్ నుంచి హార్వర్డ్ వరకు రోహన్ నాయుడు ప్రస్థానం
అందువల్ల విశ్వం తొలి దశ పరిణామాన్ని అర్థం చేసుకోవడంలో ఇది కీలకమైన ముందడుగుగా మారొచ్చని చెబుతున్నారు.
ఈ కీలక ఆవిష్కరణకు నాయకత్వం వహించిన రోహన్ నాయుడు హైదరాబాద్‌లో జన్మించారు.
ఆయన 18 ఏళ్ల వయసులో భారత్‌లో ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే నిలిపివేసి.. సింగపూర్‌లోని యేల్-ఎన్‌యూఎస్ కాలేజీలో చేరారు.
అనంతరం యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను కొనసాగించి పీహెచ్‌డీ పట్టా పొందారు.
తన పరిశోధనా ప్రస్థానంలో నాసా హబుల్ ఫెలోగా, ఎంఐటీలో పప్పలార్డో ఫెలోగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హవాయి విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వివరాలు
హైదరాబాద్ నుంచి హార్వర్డ్ వరకు రోహన్ నాయుడు ప్రస్థానం
అయితే 'బ్లాక్ హోల్ స్టార్' సిద్ధాంతాన్ని పూర్తిగా నిర్ధారించడానికి మరిన్ని పరిశీలనలు అవసరమని రోహన్ నాయుడు బృందం స్పష్టం చేసింది.
ఇలాంటి ఖగోళ వస్తువుల స్వభావం, నిర్మాణం, విశ్వ పరిణామంలో వాటి పాత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి భవిష్యత్తులో మరిన్ని పరిశీలనలు, అధ్యయనాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.