
Sonam Wangchuk: లడఖ్ హింసకు కేంద్ర బిందువుగా ఉన్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
లద్దాఖ్‌లో బుధవారం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారి నలుగురు మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 22 మంది పోలీసులు కూడా ఉన్నారు. బీజేపీ కార్యాలయం, ప్రభుత్వ భవనాలపై దాడులు, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. హింసను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు,సైనిక బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. టియర్‌గ్యాస్ షెల్స్ వదిలి పరిస్థితిని నియంత్రించారు. పట్టణంలో కర్ఫ్యూ విధించి, ఐదుగురికిపైగా గుమికూడడాన్ని నిషేధించారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని సమాచారం.
వివరాలు
కేంద్రం ఆరోపణలు
వాంగ్‌చుక్ తన ప్రసంగాల్లో "అరబ్ స్ప్రింగ్" మాదిరి నిరసనలు, "నేపాల్‌లో జెన్‌జెడ్ యువత ఉద్యమాలు" వంటి విషయాలను ప్రస్తావించడం వల్లే ఆందోళనకారులను రెచ్చిపోయారని హోంశాఖ స్పష్టం చేసింది. "సెప్టెంబర్ 24న ఉదయం 11.30 గంటలకు వాంగ్‌చుక్ ప్రసంగాలతో ప్రభావితమైన గుంపు నిరాహార దీక్ష స్థలం నుంచి బయలుదేరి, బీజేపీ కార్యాలయం, లెహ్ సీఈసీ కార్యాలయంపై దాడి చేసింది. ఆయన తన దీక్షను విరమించుకొని, గ్రామానికి వెళ్లిపోయారు. కానీ పరిస్థితిని శాంతింపజేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు" అని కేంద్రం ఆరోపించింది.
వివరాలు
వాంగ్‌చుక్ స్పందన
వాంగ్‌చుక్ ప్రభుత్వ ఆరోపణలకు ప్రత్యక్ష సమాధానం ఇవ్వకపోయినా, హింసను ఖండించారు. "మన శాంతియుత పోరాటం విఫలమైంది. ఇది నాకు బాధ కలిగిస్తోంది" అని అన్నారు. "15వ రోజు మా దీక్షలో దురదృష్టకరమైన హింస జరిగింది. ఆసుపత్రిలో ఉన్న మా సహచరుల పరిస్థితి యువతలో ఆగ్రహం రేపింది. దాంతో వేలాది మంది వీధుల్లోకి వచ్చారు" అని ఆయన వివరించారు. అలాగే, "ఇది ఒక రకంగా కొత్త తరం యువత విప్లవంలా అనిపిస్తోంది. ఐదేళ్లుగా ఉద్యోగాలు లేకపోవడంతో వాళ్లలో ఆగ్రహం పెరుగుతోంది. ప్రజాస్వామిక వేదికలు లేకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. నేను వారికి హింసను విడిచిపెట్టి శాంతియుత మార్గాన్ని అనుసరించమని వేడుకుంటున్నాను" అని అన్నారు.
వివరాలు
వాంగ్‌చుక్ డిమాండ్‌లు
వాంగ్‌చుక్ డిమాండ్‌లు స్పష్టంగా ఉన్నాయి. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలి. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో లడఖ్‌ను చేర్చాలి. అలా చేస్తే గిరిజన హక్కులు, పర్యావరణ పరిరక్షణకు బలమైన హామీ లభిస్తుందని ఆయన వాదిస్తున్నారు. ఇప్పటికే చర్చలు జరుపుతోందని కేంద్రం హోంశాఖ చెబుతోంది. కానీ కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ఆ చర్చలను అడ్డుకుంటున్నారని కేంద్రం ఆరోపించింది.
వివరాలు
వాంగ్‌చుక్ ఎవరు?
1966లో జన్మించిన సోనం వాంగ్‌చుక్ ఇంజనీర్,ఆవిష్కర్త, విద్యా సంస్కర్త, వాతావరణ ఉద్యమకారుడు. ఆమిర్ ఖాన్ నటించిన 3 Idiots సినిమాలోని పాత్రకు వాంగ్‌చుక్ ప్రేరణ కావడంతో దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు పొందారు. విద్యా రంగంలో సంస్కరణల కోసం ఆయన SECMOL అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ లడఖ్ సంస్కృతికి, పర్యావరణానికి తగిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. 1993 నుంచి 2005 వరకు లడాగ్స్ మెలాంగ్ అనే పత్రికను కూడా నడిపారు. ఆయన ముఖ్య ఆవిష్కరణల్లో -15°C చలిలో కూడా 15°C వేడిని నిలబెట్టే మట్టిగృహం, రైతుల కోసం నీటిని నిల్వ చేసే "ఐస్ స్టూపా" ఉన్నాయి.
వివరాలు
వాంగ్‌చుక్ ఎవరు?
2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా ఘర్షణల తర్వాత చైనా ఉత్పత్తులను బహిష్కరించమని ప్రజలకు పిలుపునిచ్చారు. "సైన్యం గుళ్లెట్‌తో, పౌరులు వాలెట్‌తో" అనే నినాదం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. 2024 మార్చిలో ఆయన 21 రోజుల నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో వేలాది మంది ఆయనతో పాటు నిరసనల్లో పాల్గొన్నారు. సెప్టెంబర్‌లో "దిల్లీ చలో పాదయాత్ర" కూడా చేపట్టారు. లడఖ్ భవిష్యత్తుపై చర్చలు పునరుద్ధరించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
వివరాలు
ప్రస్తుత పరిస్థితి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత లడఖ్ యూనియన్ టెర్రిటరీగా మారింది. కానీ సరైన స్వయం ప్రతిపత్తి లేదని స్థానిక నాయకులు అంటున్నారు. స్థానిక సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక రాజ్యాంగ హామీలు అవసరమని వాంగ్‌చుక్ అభిప్రాయపడుతున్నారు. ఆయన నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.