Arunachal Pradesh: చైనాకు చెక్ పెట్టే డ్యామ్‌పై అరుణాచల్ యువత ఆగ్రహం.. అసలు కారణాలివే..
ఈ వార్తాకథనం ఏంటి
అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్ నదిపై భారీ డ్యామ్ నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యువత, స్థానిక గిరిజనులు ఆందోళనకు దిగుతున్నారు. చైనా టిబెట్‌లోని యార్లుంగ్ త్సాంగ్‌పో నదిపై 60,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ నది టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్‌గా ప్రవహిస్తుంది. ఆ తర్వాత అసోంలో బ్రహ్మపుత్ర నదిగా కొనసాగుతుంది. చైనా ప్రాజెక్టు వల్ల దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం తగ్గడం, ఒక్కసారిగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన చెందుతోంది.
వివరాలు
ఈ ప్రాజెక్టును ఎన్‌హెచ్‌పీసీ అభివృద్ధి చేస్తోంది
ఈ నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ నదిపై 11,200 మెగావాట్ల సామర్థ్యంతో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు (SUMP) నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించింది.
ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది.
భారీ రిజర్వాయర్ నిర్మించడం ద్వారా నదిలో నీటి ప్రవాహంలో ఆకస్మిక మార్పులను నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా తుది అనుమతి రాలేదు. ప్రస్తుతం సాధ్యాసాధ్యాల పరిశీలన, సాంకేతిక అధ్యయనాల దశలోనే ఉంది.
వివరాలు
యువత ఎందుకు వ్యతిరేకిస్తోంది?
డ్యామ్ నిర్మిస్తే తమ పూర్వీకుల భూములు, జీవనోపాధి, సంప్రదాయాలు దెబ్బతింటాయని స్థానిక ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు.
ప్రతిపాదిత రిజర్వాయర్ వల్ల 27 గ్రామాలు నీట మునిగి, లక్ష నుంచి లక్షన్నర మంది గిరిజనులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని సియాంగ్ ఇండిజినస్ ఫార్మర్స్ ఫోరం అంచనా వేసింది.
ఈ ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే సీస్మిక్ జోన్-5లో ఉండటంతో భారీ డ్యామ్ నిర్మాణంపై ఆందోళనలు మరింత పెరిగాయి.
పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందనే భయాలు కూడా ఉన్నాయి. నవంబర్ 2026 నుంచి జనవరి 2027 వరకు ప్రాథమిక సాధ్యాసాధ్యాల సర్వే చేపట్టే ప్రతిపాదనపై కూడా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
హింసాత్మకంగా మారిన ఆందోళనలు
సర్వేలకు అనుమతిస్తే, భవిష్యత్తులో ప్రాజెక్టును అడ్డుకోవడం కష్టమవుతుందని వారు భావిస్తున్నారు. ప్రాజెక్టును రద్దు చేయాలని ఆదీ బానే కేబాంగ్ డిమాండ్ చేస్తోంది.
అక్టోబర్ 23న పాసీఘాట్‌లో బంద్ ముగిసిన తర్వాత నిరసనలు హింసాత్మకంగా మారాయి.
ఎన్‌హెచ్‌పీసీ కార్యాలయం,పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టడంతో పాటు ప్రజాప్రతినిధుల నివాసాలపై దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
రాళ్లదాడిలో 40మందికి పైగా సిబ్బంది గాయపడ్డారు. దీంతో పాసీఘాట్,మేబో,రుక్సిన్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
మరోవైపు,ప్రాజెక్టుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు వాస్తవాలు, పారదర్శకతతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ పేర్కొన్నారు.
అయితే, చైనా ప్రాజెక్టుకు అడ్డుకట్ట వేయాలనే వ్యూహం ఒకవైపు, స్థానిక ప్రజల హక్కులు, పర్యావరణ పరిరక్షణ మరోవైపు ఉండటంతో సియాంగ్ డ్యామ్ వివాదం కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మీడియాతో మాట్లాడుతున్న అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ
VIDEO | Itanagar: “I invite people to come to Itanagar or call me to Pasighat to discuss Siang Upper Multipurpose Project; bandh or violence doesn't have solutions; the project will proceed with the consent of the public”, says Arunachal Pradesh CM Pema Khandu (@PemaKhanduBJP)… pic.twitter.com/CvryM1j9A1
— Press Trust of India (@PTI_News) October 24, 2026