Arunachal Pradesh Row: అరుణాచల్ పేర్ల మార్పుపై చైనా ఆగ్రహం.. భారత్ ఏం చెప్పిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 భౌగోళిక ప్రాంతాలకు భారత్ అధికారికంగా పేర్లు పెట్టడం భారత్-చైనా మధ్య కొత్త వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చర్యను ''చట్టవిరుద్ధం,చెల్లదు'' అంటూ బీజింగ్ పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా ఇప్పటికీ 'జాంగ్‌నాన్' లేదా 'దక్షిణ టిబెట్'గా పిలుస్తోంది. అక్కడి ప్రాంతాలకు పేర్లు మార్చడం ద్వారా తాము చైనాకు చెందినవిగా భావించే భూభాగంపై హక్కు మారదని చైనా చెబుతోంది. అయితే ఈ వివాదం కేవలం మ్యాప్‌లపై పేర్ల మార్పునకు సంబంధించినది కాదు. అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా హక్కు వాదన వెనుక టిబెట్, మెక్‌మహాన్ రేఖ, తవాంగ్, భారత్-చైనా సరిహద్దు వంటి చాలా కాలంగా కొనసాగుతున్న అంశాలు ఉన్నాయి.
వివరాలు
గల్వాన్ తర్వాత మెరుగుపడుతున్న బంధాలు.. మళ్లీ తెరపైకి అరుణాచల్ వివాదం
భారత విదేశాంగ శాఖ మాత్రం అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో విడదీయరాని, అంతర్భాగమని మరోసారి స్పష్టం చేసింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని తెలిపారు.
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఆ తర్వాత రెండు దేశాలు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి.
సైనిక ఘర్షణలు జరగకుండా నియంత్రణ రేఖ వెంబడి పలు స్థాయిల్లో చర్చలు కొనసాగుతున్నాయి.
కొన్ని దౌత్య మార్గాలు కూడా తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి సమయంలో అరుణాచల్ పేర్ల వివాదం తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
అసలు అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా ఎందుకు హక్కు కోరుతోంది?
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే టిబెట్ చరిత్రను పరిశీలించాలి.
చైనా సామ్రాజ్య పాలకులు శతాబ్దాలుగా టిబెట్‌పై వివిధ స్థాయిల్లో ప్రభావం చూపించారు.
1911లో క్వింగ్ రాజవంశం పతనం తర్వాత టిబెట్ వాస్తవంగా గణనీయమైన స్వయంప్రతిపత్తితో కొనసాగింది.
ఆ సమయంలో బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య సంబంధాలు, సరిహద్దుల అంశం కీలకంగా మారింది.
టిబెట్‌ను భారత్, చైనాల మధ్య వ్యూహాత్మక బఫర్ ప్రాంతంగా బ్రిటిష్ పాలకులు భావించారు.
తూర్పు హిమాలయాల్లో స్పష్టమైన సరిహద్దు ఉండాలని వారు కోరుకున్నారు. ఈ నేపథ్యంలో 1913-14లో జరిగిన సిమ్లా సమావేశంలో బ్రిటిష్ ఇండియా, టిబెట్ ప్రతినిధులు సరిహద్దుపై చర్చించారు.
ఆ చర్చల్లో ఏర్పడిన సరిహద్దునే తర్వాత మెక్‌మహాన్ రేఖగా పిలిచారు. అయితే ఈ ఒప్పందాన్ని చైనా అంగీకరించలేదు.
వివరాలు
1950 తర్వాత టిబెట్ ఎందుకు కీలకంగా మారింది?
టిబెట్‌కు ఇలాంటి ఒప్పందం చేసుకునే అధికారం లేదన్నది చైనా వాదన.
తూర్పు సెక్టార్‌లో భారత్-చైనా సరిహద్దుపై బీజింగ్ అభ్యంతరాలకు ఈ అంశమే ఇప్పటికీ ప్రధాన కారణంగా ఉంది.
1949లో కమ్యూనిస్టు పార్టీ చైనాలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్-చైనా వివాదానికి ఆధునిక రూపం వచ్చింది.
1950లో చైనా సైన్యం టిబెట్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత బీజింగ్ అక్కడ తన నియంత్రణను మరింత బలోపేతం చేసుకుంది.
దీంతో హిమాలయాల వ్యూహాత్మక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు భారత్, టిబెట్ మధ్య ఉన్న సరిహద్దు ఇప్పుడు భారత్, చైనా మధ్య సరిహద్దుగా మారింది.
అయితే ఆ సరిహద్దు ఎక్కడ ఉండాలన్నదానిపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు.
తూర్పున మెక్‌మహాన్ రేఖనే సరిహద్దుగా భారత్ అంగీకరిస్తోంది.
వివరాలు
తవాంగ్‌పై చైనాకు ఎందుకంత ఆసక్తి?
చైనా మాత్రం దాన్ని అంగీకరించడం లేదు. టిబెట్, టిబెట్ సంస్థలతో చారిత్రక సంబంధాలు ఉన్న ప్రాంతాలు చైనాలో భాగమేనన్న విస్తృత వాదనలో అరుణాచల్‌ప్రదేశ్‌ను కూడా బీజింగ్ చేర్చుతోంది.
అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
టిబెట్ వెలుపల టిబెటన్ బౌద్ధమతానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కేంద్రాల్లో తవాంగ్ మఠం ఒకటి.
ఆరవ దలైలామా కూడా తవాంగ్‌లోనే జన్మించారు. టిబెట్‌తో ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక, మతపరమైన సంబంధాల కారణంగా తవాంగ్ చైనాకు మరింత సున్నితమైన అంశంగా మారింది.
దలైలామా అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించిన సందర్భాల్లో, ముఖ్యంగా తవాంగ్‌కు వెళ్లినప్పుడు చైనా పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది.
భారత అగ్రనేతలు తవాంగ్‌లో పర్యటించినప్పుడూ బీజింగ్ నిరసన తెలిపింది.
వివరాలు
అరుణాచల్ ప్రాంతాల పేర్లు మార్చుతున్న చైనా
చైనాకు టిబెట్ అంశం కేవలం భూభాగానికి సంబంధించినది కాదు. తమ సార్వభౌమత్వం, టిబెటన్ మతపరమైన, రాజకీయ గుర్తింపు భవిష్యత్తుతో కూడా ఇది ముడిపడి ఉంది.
భవిష్యత్తులో దలైలామా వారసుడి ఎంపిక కూడా చైనా వ్యూహాత్మక ఆలోచనల్లో తవాంగ్‌కు ప్రాధాన్యం పెంచే మరో అంశంగా భావిస్తున్నారు.
సరిహద్దు వివాదం 1962లో సైనిక ఘర్షణకు దారితీసింది.
అప్పట్లో చైనా సైన్యం నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీగా పిలిచిన ప్రాంతంలోకి ముందుకు వచ్చింది.
అదే ప్రాంతం ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌గా ఉంది. తర్వాత చైనా ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించి, తూర్పు ప్రాంతంలో ఆక్రమించిన చాలా భూభాగాల నుంచి వెనక్కి వెళ్లింది.
అయితే యుద్ధం తర్వాత కూడా సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు.
వివరాలు
అరుణాచల్ ప్రాంతాల పేర్లు మార్చుతున్న చైనా
మెక్‌మహాన్ రేఖను, అరుణాచల్‌పై భారత్ హక్కును చైనా అంగీకరించకుండా తన వాదనను కొనసాగించింది.
2017లో మరో విధమైన వ్యూహాన్ని బీజింగ్ ప్రారంభించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా అధికారిక పేర్లను ప్రకటించడం మొదలుపెట్టింది.
ఆ తర్వాత 2021లో, అనంతరం కూడా మరిన్ని ప్రాంతాలకు పేర్లు ప్రకటించింది.
భారత్ ఈ పేర్ల మార్పులను మొదటి నుంచీ తిరస్కరిస్తోంది. ప్రాంతాల పేర్లు మార్చినంత మాత్రాన అవి భారత భూభాగం అన్న వాస్తవం మారదని స్పష్టం చేస్తోంది.
వివరాలు
భారత్ 27 పేర్లు పెట్టడం ఎందుకు కీలకం?
చైనా అనుసరిస్తున్న ఈ మ్యాప్,పేర్ల వ్యూహానికి భారత్ తాజా నిర్ణయం ఒక విధమైన ప్రతిస్పందనగా కనిపిస్తోంది.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని 27భౌగోళిక ప్రాంతాలకు ప్రభుత్వం అధికారికంగా ప్రామాణిక పేర్లు పెట్టింది.
వీటిలో పర్వత మార్గాలు,సరస్సు,ఇతర భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి.
ఈపేర్లు భారత ప్రభుత్వ అధికారిక వినియోగంలో ఉన్న పదజాలాన్ని మరింత బలపరుస్తాయి.
ఆయా ప్రాంతాలను భారత్ అధికారిక మ్యాప్‌లు, పరిపాలనా వ్యవస్థలో భాగంగా చూపించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
అయితే పేర్లు మార్చడం వల్ల సరిహద్దు చట్టపరంగా మారదు. కానీ భూభాగ వివాదాల్లో మ్యాప్‌లు, ప్రాంతాల పేర్లకు రాజకీయ ప్రాధాన్యం ఉంటుంది.
ఒక దేశం తన భూభాగంపై హక్కు, పరిపాలనా ఉనికిని బలంగా చూపించేందుకు ఇవి ఉపయోగపడతాయి.
అందుకే భారత్ తాజా నిర్ణయంపై చైనా తీవ్రంగా స్పందించింది.
వివరాలు
భారత్-చైనా సంబంధాలు మెరుగుపడుతున్నా వివాదం ఎందుకు కొనసాగుతోంది?
తాజా పేర్ల వివాదం భారత్-చైనా సంబంధాల్లో జరుగుతున్న సానుకూల మార్పులకు కూడా పరిమితులు ఉన్నాయని స్పష్టం చేస్తోంది.
వాస్తవాధీనరేఖ వెంబడి సైనికులు పరస్పరం ఘర్షణ పడకుండా రెండుదేశాలు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు.
కానీ తుది సరిహద్దు ఎక్కడ ఉండాలన్న అంశంపై మాత్రం అంగీకారం కుదరకపోవచ్చు.
అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో ఈతేడా మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
అరుణాచల్ భారత్‌లో భాగమా కాదా అన్న అంశంపై భారత్ చర్చలు జరపడం లేదు.
అదే సమయంలో చైనా కూడా తాను'దక్షిణ టిబెట్'గా పిలిచే ప్రాంతంపై తన హక్కు వాదనను వదులుకోవడం లేదు.
అందుకే 27ప్రాంతాలకు భారత్ పేర్లు పెట్టడం కేవలం పేర్ల మార్పు కాదు.
మ్యాప్‌లు,చరిత్ర,సరిహద్దులు,సార్వభౌమత్వంపై దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్-చైనా పోరులో ఇది మరో అధ్యాయంగా మారింది.