Fake Rabies: నకిలీ రేబీస్ వ్యాక్సిన్ కలకలం.. దేశవ్యాప్తంగా అధికారుల అప్రమత్తం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో నకిలీ రేబీస్ వ్యాక్సిన్ల వ్యవహారం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖర్జీ నగర్‌లో లైసెన్స్ లేని ప్రాంగణంలో నిర్వహించిన సోదాల్లో తప్పుగా లేబుల్ చేసిన 'అభయరబ్' (Abhayrab) వ్యాక్సిన్‌ను అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా.. కేసు దర్యాప్తు, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ అధికారులు సంయుక్తంగా ముఖర్జీ నగర్‌లోని ఓ ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు. ఈ ప్రాంగణానికి అవసరమైన లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా 'అభయరబ్' రేబీస్ వ్యాక్సిన్‌కు సంబంధించిన KE25012 బ్యాచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్పత్తిపై తప్పుగా లేబులింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
వివరాలు
పరీక్షల్లో నకిలీగా నిర్ధారణ
స్వాధీనం చేసుకున్న వ్యాక్సిన్ నమూనాలను అధికారులు కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ (CDL)కి పంపించారు.
అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆ వ్యాక్సిన్ నాణ్యతా ప్రమాణాలను అందుకోలేదని తేలింది.
అంతేకాకుండా.. అది తప్పుగా లేబుల్ చేసిన నకిలీ వ్యాక్సిన్ అని ప్రయోగశాల పరీక్షలు నిర్ధరించాయి.
రాష్ట్రాలకు DCGI కీలక ఆదేశాలు
దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అప్రమత్తమైంది.
KE25012 బ్యాచ్‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోల్ అధికారులను ఆదేశించింది.
ఈ బ్యాచ్‌కు చెందిన వ్యాక్సిన్లు మార్కెట్లో విక్రయానికి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
వివరాలు
అసలైన తయారీ సంస్థ వివరణ
స్వాధీనం చేసుకున్న నకిలీ వ్యాక్సిన్లతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని అసలైన 'అభయరబ్' తయారీ సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది.
తమ వ్యాక్సిన్లను స్వతంత్రంగా పరీక్షించి, ప్రభుత్వం నుంచి బ్యాచ్-విడుదల ధ్రువీకరణ పొందిన తర్వాతే మార్కెట్లోకి పంపుతామని సంస్థ మరోసారి వెల్లడించింది.
ఎగుమతి కాలేదని నిర్ధారణ
పట్టుబడిన నాణ్యతా రహిత వ్యాక్సిన్ బ్యాచ్‌లోని ఏ ఉత్పత్తీ ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
దేశీయ మార్కెట్లోనే దీనిని గుర్తించి అడ్డుకున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు, మెడికల్ షాపుల నిర్వాహకులు రేబీస్ వ్యాక్సిన్లు కొనుగోలు చేసే సమయంలో వ్యాక్సిన్ పేరు, బ్యాచ్ నంబర్, లేబులింగ్ తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు సూచించారు.