 
                                                                                Festive Season: దేశ ఆర్థిక దిశను మార్చిన పండుగ సీజన్ ఖర్చులు!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది భారత పండుగల సీజన్ మార్కెట్లకు నిజంగా ఒక పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది. సాధారణంగా దసరా-దీపావళి సమయాల్లో ఖర్చులు, కొనుగోళ్లు పెరగడం సహజమే కానీ, ఈసారి ఆ స్థాయి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. అనేక రంగాలు ఈ పెరిగిన డిమాండ్‌కి సరిపడా సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇంకా పండుగల సీజన్ ఖర్చులు పూర్తిగా ఆగలేదు. ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయి.
పెరిగిన కొనుగోళ్లు
తగ్గిన ద్రవ్యోల్బణం, GST సవరణలతో కొనుగోళ్లు పెరిగాయి
ఈ సంవత్సరం పండుగల సమయంలో ఖర్చులు పెరగడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది: దేశంలో ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్లలో కనిష్ట స్థాయి.. అంటే 1.5 శాతం వద్ద నిలిచింది. రెండవది:కేంద్ర ప్రభుత్వం చేసిన GST తగ్గింపులు అనేక వస్తువులపై పరోక్ష పన్నులు తగ్గించి ప్రజలకు మరింత కొనుగోలు చేసే అవకాశం కల్పించాయి. మూడవది: బంగారం ధరలు పెరగడంతో భారత కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ $3.9 ట్రిలియన్‌కి చేరింది. మనీ కంట్రోల్ ప్రకారం,ఐక్రా ప్రధాన ఆర్థిక నిపుణురాలు అదితి నాయకర్ మాట్లాడుతూ.. "2025 సెప్టెంబర్‌లో CPI ద్రవ్యోల్బణం 99 నెలల కనిష్టమైన 1.5 శాతానికి చేరింది. ఆహారం, పానీయాల ధరలు 81 నెలల కనిష్టం 1.4 శాతానికి తగ్గడం ఇందుకు కారణం.
GST 2.0
GST 2.0 ప్రభావం.. ప్రజల చేతుల్లోకి రూ.2 లక్షల కోట్లు
అయితే బంగారం,వెండి ధరలు పెరగడంతో ఇతర విభాగాల్లో ద్రవ్యోల్బణం కొంత పెరిగింది"అని తెలిపారు. HDFC మ్యూచువల్ ఫండ్ అంచనాల ప్రకారం,తాజా జీఎస్టీ తగ్గింపుల వల్ల ప్రజల చేతుల్లో సుమారు రూ.2లక్షల కోట్ల అదనపు నిధులు మిగిలాయి. అవి పండుగల సమయంలో సరుకులు,సేవలపై ఖర్చయ్యాయి. దీని వల్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. అనూహ్య డిమాండ్‌తో పరిశ్రమలు కంగారు! ఈ సీజన్‌లో వాహనాలు,ఎలక్ట్రానిక్స్, ఆహారపదార్థాలు మొదలైన అనేక రంగాలు భారీ డిమాండ్‌ను తట్టుకోలేక పోయాయి. చాలా కంపెనీలు ఆదివారాలు కూడా ఫ్యాక్టరీలు నడపాల్సి వచ్చింది. ప్రీమియం 65-85 అంగుళాల టీవీలు,8 కిలోలకుపైగా వాషింగ్ మెషీన్లు,450లీటర్లకు పైగా ఫ్రిజ్‌లు,డిష్‌వాషర్లు వంటి ఉత్పత్తులకు వేచి చూడాల్సిన సమయం నెలలుగా పెరిగింది.పెద్ద ప్యాకుల చాక్లెట్లు,బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్ కొరత కనిపించింది.
రికార్డు
మారుతి,టాటా వంటి కంపెనీలు రికార్డ్ విక్రయాలతో మెరిశాయి
కంపెనీలు 30-35శాతం డిమాండ్ పెరుగుతుందని భావించగా,నిజానికి అది 50-100 శాతం వరకు పెరిగిందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. మారుతి సుజుకి ప్రతిరోజూ 14,000 బుకింగ్స్ అందుకుంటోందని,GST తగ్గింపుల ముందు రోజుకు 10,000 మాత్రమే ఉండేవని కంపెనీ మార్కెటింగ్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. నవరాత్రి నుండి అక్టోబర్ 19 వరకు కంపెనీ 3.35 లక్షల వాహనాలు విక్రయించిందని,ఇది గత ఏడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువని ఆయన తెలిపారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అమిత్ కామత్ మాట్లాడుతూ.. "నవరాత్రి నుండి దీపావళి వరకు 1 లక్షకు పైగా వాహనాలు డెలివరీ ఇచ్చాం.డిమాండ్ అంత ఎక్కువగా ఉండటంతో కొన్ని మోడళ్లకు 30 వారాల వరకు వేచి చూడాల్సి వస్తోంది"అన్నారు.
వివరాలు
ఇళ్లలో ఉపకరణాల అమ్మకాలు రెండింతలు
వాషింగ్ మెషీన్లు, డిష్‌వాషర్లు, పెద్ద టీవీలు, ఫ్రిజ్‌లు వంటి ఉపకరణాల అమ్మకాలు గత ఏడాది పండుగలతో పోలిస్తే 50-100 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 55 అంగుళాలకంటే పెద్ద టీవీలకు, సైడ్ బై సైడ్ ఫ్రిజ్‌లకు అధిక డిమాండ్ నమోదైంది. మొత్తం మీద, తక్కువ ద్రవ్యోల్బణం, GST తగ్గింపులు, బంగారం విలువ పెరగడం వంటి కారణాల కలయికతో ఈ పండుగల సీజన్ దేశవ్యాప్తంగా వినియోగం విపరీతంగా పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని ఈ వినియోగ దూకుడు కొనసాగిస్తుందనే అంచనాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.