Gold Buying: ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని సూచన.. కారణమేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. ఇలా చేస్తే విదేశీ మారక నిల్వలను గణనీయంగా ఆదా చేయవచ్చని తెలిపారు. ఇంటి నుంచే పనులు నిర్వహించడం, ఆన్‌లైన్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వడం,పెట్రోల్-డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలు వినియోగించడం వంటి పొదుపు మార్గాలను కూడా ప్రస్తావించారు.
వివరాలు
ముడి చమురులో సుమారు 85శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న భారత్
అయితే వివాహాలు, ఇతర వేడుకల కోసం కూడా ఏడాది వరకు బంగారం కొనకుండా ఉండాలని చేసిన పిలుపు ప్రత్యేక చర్చకు దారితీసింది. భారతదేశం అవసరమైన ముడి చమురులో సుమారు 85శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇదే విధంగా బంగారం వినియోగంలోనూ విదేశాలపై అధికంగా ఆధారపడుతోంది. దేశంలో ఏటా 700 నుంచి 800 టన్నుల వరకు బంగారం వినియోగం ఉండగా,అందులో చాలా తక్కువ మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. అంటే 90 శాతానికి పైగా బంగారం దిగుమతుల ద్వారానే వస్తోంది.ఈ రెండు వస్తువులకు అమెరికా డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి వస్తుంది. దీంతో దిగుమతులు పెరిగిన కొద్దీ విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. అదే సమయంలో డాలర్‌కు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ బలహీనపడుతుంది.
వివరాలు .
దిగుమతులను తగ్గించేందుకు బంగారం ధరలను పెంచినా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం
బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రభుత్వం సూచించడం వెనుక ప్రధాన ఉద్దేశం అనవసర వ్యయాలను నియంత్రించడమేనని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బంగారం నేరుగా పారిశ్రామిక ఉత్పత్తులతో సంబంధం కలిగి ఉండదు. కానీ ముడి చమురు కొరత ఏర్పడితే రవాణా, ఉత్పత్తి రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మరోవైపు దిగుమతులను తగ్గించేందుకు బంగారం ధరలను పెంచినా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. రూపాయి విలువ తగ్గితే దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. దాంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుంది. ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోళ్లు తగ్గితే దిగుమతి బిల్లు తగ్గి రూపాయి స్థిరత్వానికి కొంత మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
బంగారానికి ప్రత్యామ్నాయంగా..
బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. గతంలో దిగుమతులు అధికంగా పెరిగిన సందర్భాల్లో పలు నియంత్రణ చర్యలు తీసుకుంది. బంగారంపై దిగుమతి సుంకాలను పెంచడం, దిగుమతులపై పరిమితులు విధించడం, బంగారానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ బంగారు బాండ్ల పథకాలను ప్రవేశపెట్టడం వంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.
వివరాలు
ప్రాధాన్యం సంతరించుకున్న ప్రధాని మోదీ సూచన
చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో పాటు సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఈ ప్రభావం వర్ధమాన దేశాల కరెన్సీలపై పడుతోంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల సమయంలో రూపాయి విలువ కూడా ఇటీవల గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో దిగుమతి వ్యయాలను తగ్గించడం ద్వారా మాత్రమే రూపాయి విలువను స్థిరంగా ఉంచడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అందుకే బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ చేసిన సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.