Page Loader
2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ
2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ

2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ

వ్రాసిన వారు Stalin
Mar 03, 2023
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. తాను ఏ పార్టీతోనూ చేతులు కలపబోనని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు. టీఎంసీ ప్రజలతో పొత్తు పెట్టుకోనుందని, కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా-మార్క్సిస్ట్‌(సీపీఐ-ఎం)లకు ఓటేస్తున్న వారు పరోక్షంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఓటేస్తున్నారని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌డిఘి ఉపఎన్నికలో కాంగ్రెస్ చేతిలో టీఎంసీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మమత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల మహా కూటమి అవకాశాలను బలహీనపరుస్తుంది.

మమత

బీజేపీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ ఫ్రంట్‌ల మధ్య అనైతిక పొత్తు: మమత

బీజేపీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ ఫ్రంట్‌ల మధ్య అనైతిక పొత్తు ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. పార్టీలకు ఇచ్చిపుచ్చుకునే బంధం ఉందని, రానున్న రోజుల్లో టీఎంసీ వారి రాజకీయ నాటకానికి ముగింపు పలుకుతుందని చెప్పారు. సాగర్‌దిఘి ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు మతతత్వ కార్డును వాడారని ఆమె పేర్కొన్నారు. టీఎంసీ ఒంటరిగా బీజేపీని తరిమికొడుతుందని మమత ధీమా వ్యక్తం చేశారు. గురువారం వెలువడిన మేఘాలయ అసెంబ్లీ ఫలితాల్లో టీఎంసీ ఐదు స్థానాలను గెల్చుకున్నది. టీఎంసీ జాతీయ పార్టీగా అవతరించేందుకు ఇది దోహదపడుతుందని మమత అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మేఘాలయలో తమ పార్టీ ప్రచారం ప్రారంభించిందని, 15% ఓట్ షేరింగ్ సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందని ఆమె అన్నారు