Asaduddin Owaisi: సీమాంచల్‌కు న్యాయం చేస్తేనే మద్దతు… నితీశ్ ప్రభుత్వంపై ఒవైసీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఇందుకు ఒక కీలక షరతు విధించారు. ఏళ్ల తరబడి వెనుకబడిన సీమాంచల్ ప్రాంతానికి న్యాయం జరిగితేనే తమ మద్దతు లభిస్తుందని స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలుచుకున్న అనంతరం అమౌర్‌లో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పాట్నా, రాజ్‌గిర్‌కే పరిమితం కాకూడదు. సీమాంచల్ ప్రాంతం నదుల కోత, భారీ వలసలు, అవినీతి వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలి. సీమాంచల్‌కు న్యాయం జరిగితే నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి మేం సిద్ధమని ఒవైసీ స్పష్టం చేశారు.
Details
సీమాంచల్ అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి
బిహార్ ఈశాన్యాన ఉన్న సీమాంచల్‌లో ముస్లింలు అధికంగా నివసిస్తారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రాంతంలోని 24 నియోజకవర్గాల్లో ఎన్డీయే 14 స్థానాలు సాధించగా, ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం 2020లోలాగే ఈసారి కూడా ఐదు సీట్లు కైవసం చేసుకుంటూ తన ప్రభావాన్ని కొనసాగించింది. అలాగే తమ పార్టీ ప్రజాప్రతినిధులపై కఠిన నియమాలను అమలు చేస్తున్నట్లు ఒవైసీ వెల్లడించారు. మా ఐదుగురు ఎమ్మెల్యేలు వారానికి రెండుసార్లు తమ నియోజకవర్గ కార్యాలయాల్లో కూర్చుని వాట్సాప్ లైవ్ లొకేషన్‌తో ఫొటోను నాకు పంపాలి. వారు ఎక్కడ ఉన్నారో నాకు పూర్తిగా తెలుస్తుందని తెలిపారు.
Details
ప్రతిపక్ష వైఫల్యంపై ఒవైసీ స్పందన
ఈ విధానాన్ని ఆరు నెలల్లో ప్రారంభిస్తామని, తానే కూడా ప్రతి ఆరు నెలలకు ప్రాంతాన్ని పర్యటించనున్నట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం ప్రతిపక్ష వైఫల్యంపై కూడా ఒవైసీ స్పందించారు. ఆర్జేడీ ఆధారపడే 'ఎంవై' (ముస్లిం-యాదవ్) సమీకరణం బీజేపీని అడ్డుకోలేదని తాను ముందే హెచ్చరించానని గుర్తుచేశారు.