LOADING...
#NewsBytesExplainer: కాంగ్రెస్ హయాంలో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ఆగిపోయిందా? అధికారులు ఏమంటున్నారు?
అధికారులు ఏమంటున్నారు?

#NewsBytesExplainer: కాంగ్రెస్ హయాంలో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ఆగిపోయిందా? అధికారులు ఏమంటున్నారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైతుల భూములపై హక్కులను నిర్ధారించే ముఖ్యమైన ఆధారం పట్టాదార్ పాస్ పుస్తకం. ఈ పుస్తకంలో భూమి యజమాన్య వివరాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి రైతులు దీన్ని ఎంతో విలువగా భావించి జాగ్రత్తగా భద్రపరుస్తారు. పంట రుణాలు, వివిధ ప్రభుత్వ పథకాలు, భూమి సంబంధించిన రికార్డులు పొందడానికి ఈ పాస్ పుస్తకమే ఆధారం. కానీ ప్రస్తుతం ఈ పాస్ పుస్తకాల జారీ విషయంలో రెవెన్యూ శాఖ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ పూర్తిగా ఆగిపోయింది. భూమి రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత వారు పాస్‌బుక్‌ అందలేదంటూ తాసిల్దార్‌ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

పాస్‌బుక్

ఆర్నెళ్లుగా పత్తా లేని పాస్‌బుక్‌ల జారీ 

"మా పాస్ పుస్తకాలు ఎప్పుడిస్తారు?"అని అడిగితే అధికారులు మాత్రం"ఇది మా పరిధిలో లేదు, సీసీఎల్ఏ కార్యాలయం నుంచి పోస్టులో వస్తుంది"అంటూ తప్పించుకుంటున్నారు. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.రిజిస్ట్రేషన్ సమయంలోనే పాస్ పుస్తక ముద్రణ పేరుతో డబ్బులు వసూలు చేసి, తర్వాత వాటిని ఇవ్వకుండా విస్మరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలలుగా పాస్ పుస్తకాల పంపిణీ నిలిచిపోయింది. అంతకు ముందు కూడా పోస్టులో పుస్తకాలు పంపేందుకు రెండు నుంచి మూడు నెలలు పట్టేది. ఈ సంవత్సరం జూలైలో పాస్ పుస్తక ముద్రణ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో పరిస్థితి మరింత దిగజారింది. కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే వరకు తాత్కాలిక ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపినట్లు తెలుస్తోంది.

పాస్‌బుక్

ఆర్నెళ్లుగా పత్తా లేని పాస్‌బుక్‌ల జారీ 

ప్రతిరోజూ రాష్ట్రంలోని 574 మండల తహసీల్దార్ కార్యాలయాల్లో వేలాదిగా భూమి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొన్ని మండలాల్లో రోజుకు పది రిజిస్ట్రేషన్లు జరిగితే, మరికొన్నిచోట్ల యాభైకి పైగా కూడా జరుగుతున్నాయి. అంచనా ప్రకారం రోజుకు సుమారు పదివేల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా,నెలకు మూడువేల వరకు, ఆరు నెలల్లో దాదాపు 18 లక్షల పాస్ పుస్తకాలు జారీ కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వివరాలు ఆన్‌లైన్ ద్వారా సీసీఎల్ఏ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి ముద్రణ సంస్థకు చేరి, పాస్ పుస్తకం తయారు చేసి పోస్టులో నేరుగా రైతుకు పంపించే విధానం ఉండేది. ధరణి పోర్టల్ సమయంలో రెండు వారాల్లో పాస్ పుస్తకం రైతు ఇంటికి చేరేది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ స్తంభించిపోయింది.

భూభారతి

భూభారతి వచ్చినా ఇవ్వరా? 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ధరణి పోర్టల్ రద్దు పేరుతో కాలయాపన చేసి, రైతులను ఇబ్బంది పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ వచ్చినా సమస్యలు తగ్గలేదని రైతులు చెబుతున్నారు. పాస్ పుస్తకం లేకపోవడంతో పంట రుణాలు పొందలేకపోతున్నామని, ప్రధాన మంత్రి కిసాన్ పథకం వంటి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లి అడిగితే అధికారులు "భూభారతి నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి" అని సమాధానం ఇస్తున్నారట. రైతులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "ముద్రణ కోసం మాతో డబ్బులు తీసుకుని ఇప్పుడు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోమంటారా?" అంటూ మండిపడుతున్నారు.

భూభారతి

భూభారతి వచ్చినా ఇవ్వరా? 

ప్రతిరోజూ సీసీఎల్ఏ కార్యాలయానికి పాస్ పుస్తకాల కోసం పది నుంచి ఇరవై మంది రైతులు వస్తున్నారని సమాచారం. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణకు మంగళం పాడేలా ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రైతు భూమి స్వాధీనంలో ఉన్నప్పటికీ పాస్ పుస్తకం లేకుండా రుణాలు, సబ్సిడీలు, పథకాలు పొందడంలో అవరోధాలు ఎదురవుతున్నాయి. దీంతో "ఇక పాస్ పుస్తకం లేకపోతే భూమికి కూడా రక్షణ లేకుండా పోతుందేమో" అనే భయం రైతుల్లో నెలకొంది.