
Operation Sindoor: సిందూర్ పార్ట్ 2, 3 పాకిస్థాన్ చర్యలపై ఆధారపడి ఉంటాయి: రాజ్‌నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాదులను మద్దతు ఇచ్చే పాకిస్థాన్ ను కేవలం సరిహద్దుల్లోనే కాకుండా, వారి భూభాగంలోనూ గట్టిగా బుద్ధి చెప్పామన్నారు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ప్రస్తుతం మొరాకో పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ప్రవాస భారతీయులతో కలసి మాట్లాడారు. ఈ సందర్భంలో 'ఆపరేషన్ సిందూర్' విజయాలను వెల్లడించి, పాకిస్థాన్ తీరుపై ఆధారపడి ఉండే 'సిందూర్ పార్ట్ 2' గురించిన హెచ్చరికలు చేశారు.
వివరాలు
ప్రభుత్వం ఆమోదిస్తే, ఆపరేషన్‌కు సిద్ధంగా ఉన్నారా?
"ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి, మతాన్ని చూపించి మన పౌరులను హతమార్చారు. మేము వారి మతాన్ని చూసి వారిని శిక్షించలేదు; వారు చేసిన చర్యలను బట్టి తగిన తీరులో వ్యవహరించాం. పహల్గాం ఘటన తరువాత, త్రివిధ సైన్యాధిపతులతో జరిగిన సమావేశంలో నేను ఒకే ప్రశ్న అడిగాను: 'ప్రభుత్వం ఆమోదిస్తే, ఆపరేషన్‌కు సిద్ధంగా ఉన్నారా?' వారు ఏ ఆలస్యం లేకుండా సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. దీని తర్వాత, ప్రధాని మోదీకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చి సైన్యానికి ఆదేశమిచ్చాం" అని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
వివరాలు
దాయాది భూభాగంలోనికి వెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసాము: రాజ్‌నాథ్
"ఆపరేషన్ తర్వాత ఏమి జరిగిందో ప్రపంచం చూసింది. కేవలం సరిహద్దుల్లో కాకుండా, 100 కిలోమీటర్ల లోపలి దాయాది భూభాగంలోనికి వెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసాము. ఆ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబం చెల్లాచెదురైందని జైషే ఉగ్ర నాయకులు స్వీకరించారు. పాకిస్థాన్ అభ్యర్థన కారణంగా కాల్పుల విరమణకు ఒప్పాం. వాజ్‌పేయీగారు చెప్పినట్లే, స్నేహితులు మారొచ్చు, కానీ పొరుగువారు ఎప్పటికీ మారరు. అందుకే వారిని సరైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. "ప్రస్తుతానికి ఆపరేషన్ సిందూర్ నిలిపివేయబడింది. కానీ అవసరమైతే మళ్లీ ప్రారంభించవచ్చు. సిందూర్ పార్ట్ 2, 3 పాకిస్థాన్ చర్యలపై ఆధారపడి ఉంటాయి. వారు ఉగ్రవాద చర్యలను కొనసాగిస్తే, మేము తగిన విధంగా తీరుతాము" అని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.