Nitin Nabin: 'బెంగాల్‌లో కూడా గెలుస్తాం': బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో కూడా తమ పార్టీకి విజయం తప్పదని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. తాజాగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు. పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే తన తొలి లక్ష్యమని స్పష్టంగా తెలిపారు. "కేంద్ర నాయకత్వం మాపై ఉంచిన విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని, పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేయడంపైనే నా ప్రధాన దృష్టి ఉంటుంది" అని నితిన్ నబిన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలపై ప్రశ్నించగా, బెంగాల్‌లో కూడా బీజేపీ గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వివరాలు
బీజేపీలో కొత్త తరం నాయకత్వానికి ఇది సూచన
"మా పార్టీ సంస్థాగత నిర్మాణం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బలంగా ఉంది. అదే మా విజయానికి ప్రధాన కారణం అవుతుంది" అని ఆయన వివరించారు. నితిన్ నబిన్ నియామకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. 'ఎక్స్' వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. "నితిన్ సామర్థ్యాలు,ఆయన అంకితభావం రాబోయే రోజుల్లో మన పార్టీని మరింత శక్తివంతం చేస్తాయని నమ్ముతున్నాను" అని మోదీ పేర్కొన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబిన్,బీహార్ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహించిన అనుభవం కలిగిన నేత. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీలో కొత్త తరం నాయకత్వానికి ఇది సూచనగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.