LOADING...
Mumbai:ముంబయి విమానాశ్రయంలో తృటిలో తప్పిన ప్రమాదం.. పరస్పరం ఢీ కొన్న రెండు విమానాల రెక్కలు
పరస్పరం ఢీ కొన్న రెండు విమానాల రెక్కలు

Mumbai:ముంబయి విమానాశ్రయంలో తృటిలో తప్పిన ప్రమాదం.. పరస్పరం ఢీ కొన్న రెండు విమానాల రెక్కలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. విమానాశ్రయ పరిధిలో నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఎయిర్‌ ఇండియా,ఇండిగో సంస్థలకు చెందిన రెండు విమానాల రెక్కలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)స్పష్టం చేసింది. సాధారణ తనిఖీల కోసం విమానాలు కదులుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని డీజీసీఏ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే, ఎయిర్‌ఇండియాకు చెందిన AI 2732 విమానం తమిళనాడులోని కోయంబత్తూర్‌కు వెళ్లేందుకు పార్కింగ్ బే నుంచి రన్‌వే వైపు టాక్సింగ్ చేస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ముంబయికి చేరుకున్న ఇండిగో విమానం (6E 791)రన్‌వే నుంచి పార్కింగ్ బే దిశగా కదులుతోంది.

వివరాలు 

రెండు విమానాల రెక్కలకు స్వల్పంగా నష్టం

ఈ క్రమంలో రెండు విమానాల రెక్కలు పరస్పరం తాకి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు విమానాల రెక్కలకు స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు డీజీసీఏ తెలిపింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు కూడా పేర్కొంది. పార్కింగ్ బే వద్దకు చేరుకున్న అనంతరం ఇండిగో విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు కోయంబత్తూర్‌కు వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా విమానాన్ని మరమ్మతుల కోసం తరలించినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్‌ఇండియా ప్రతినిధి మీడియాకు తెలిపారు.

Advertisement