LOADING...
Arunachalam: అరుణాచలంలో హీలియం సిలిండర్ పేలి.. నలుగురు మృతి, 12 మందికి పైగా గాయాలు
అరుణాచలంలో హీలియం సిలిండర్ పేలి.. నలుగురు మృతి, 12 మందికి పైగా గాయాలు

Arunachalam: అరుణాచలంలో హీలియం సిలిండర్ పేలి.. నలుగురు మృతి, 12 మందికి పైగా గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్నిలింగేశ్వరుడి సన్నిథి చుట్టూ గిరిప్రదక్షిణ చేసి.. శివయ్యను తనివితీరా దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు విచ్చేసే పుణ్యక్షేత్రమైన అరుణాచలం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కళ్లకురిచ్చి జిల్లా మనలూర్ పేటలో సోమవారం సాయంత్రం హీలియం గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని తిరువణ్ణామలై (అరుణాచలం) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు కాళ్లను కోల్పోయారని సమాచారం. అంతేకాకుండా మరో ఆరుగురు గాయపడిన వారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

పేలిన హీలియం సిలిండర్

కానుమ్ పొంగల్ ఉత్సవం సందర్భంగా వందలాది భక్తులు తిరువిళా వేడుకలో పాల్గొనడానికి వచ్చారు. రాత్రి సుమారు 7 గంటల సమయంలో, ఉత్సవ వేదిక వద్ద బెలూన్లను నింపేందుకు వాడే హీలియం సిలిండర్ పేలడంతో ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందినవారుగా గుర్తించారు. సిలిండర్ చిన్నదైనప్పటికీ, ఒక్కసారిగా పేలడం వల్ల సమీపంలో ఉన్న సిబ్బంది తీవ్రంగా ప్రభావితమయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పిల్లలు ఆడే బెలూన్లలో ఉపయోగించే హీలియం సాధారణంగా ప్రమాదకరం కాకపోవచ్చునని, అయితే సిలిండర్లో పీడనం అధికంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం సంభవించగలదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా పోలీస్ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

Advertisement