నేడు పెద్దలసభకు నారీ శక్తి వందన్ అధినియం బిల్లు-2023.. చరిత్ర సృష్టించనున్న మహిళా బిల్లు
నేడు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు-2023ని ప్రవేశపెట్టనున్నారు. ఎగువసభలో 106వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పరిగణించనున్నారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందగానే, రాష్ట్రపతి ఆమోదం లాంఛనం కానుంది. ఫలితంగా 3 దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న మహిళల రిజర్వేషన్ బిల్లు చట్ట రూపం దాల్చనుంది. ఇప్పటికే బుధవారం భారీ మెజార్టీతో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ క్రమంలోనే రాజ్యాంగ (128వ సవరణ) బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 456 ఓట్లకు గానూ 454 సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు తొలిదశ దాటింది. నేడు రెండో దశను ఎదుర్కోనుంది.
బిల్లుపై మాట్లాడనున్న 14 మంది బీజేపీ మహిళా ఎంపీలు, మంత్రులు
రాజ్యసభలో ఇవాళ నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పరిశీలనకు రానుంది. గత యూపీఏ హయాంలో మహిళా కోటా బిల్లును ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 2008లో తీసుకొచ్చింది. 2010లో రాజ్యసభ ఆమోదం పొందింది. అయితే రాజకీయ విభేదాల కారణంగా లోక్‌సభలో బిల్లుకు ఆమోదం లభించలేదు. ఈ క్రమంలోనే 15వ లోక్‌సభ ఎన్నికల కారణంగా రద్దయిపోయింది. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం గత 27 ఏళ్లుగా ఈ మహిళా బిల్లు పెండింగ్‌లోనే ఉంది. బిల్లును పునరుద్ధరిస్తూ, ఎగువసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం కోటాను మహిళలకు ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు గురువారం రాజ్యసభకు రానుంది. బిల్లుపై చర్చలో బీజేపీకి చెందిన 14 మంది మహిళా ఎంపీలు, మంత్రులు మాట్లాడనున్నారు.