లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ
పార్లమెంట్ కొత్త భవనంలో మంగళవారం లోక్‌సభ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1:15 గంటలకు జాతీయ గీతాలాపనతో చారిత్రాత్మక సెషన్ మొదలైంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. సెప్టెంబర్ 19ని "చారిత్రాత్మక దినం"గా అభివర్ణించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రతిపక్షాలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభలలో మహిళల సభ్యత్వాన్ని మరింత పెంచుతుందని, మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేస్తుందని మోదీ అన్నారు.
దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు: మోదీ
అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు ప్రవేశపెట్టారని, అయితే బిల్లును ఆమోదించడానికి తగినంత మెజారిటీ లేదని, ఫలితంగా ఈ కల అసంపూర్తిగా మిగిలిపోయిందని మోదీ అన్నారు. నేడు దేవుడు దీనిని ముందుకు తీసుకెళ్లడానికి తన కు అవకాశం ఇచ్చాడని మోదీ పేర్కొన్నారు. ఇది కొత్త పార్లమెంటు భవనం మొదటి చారిత్రాత్మక సమావేశమని మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఏం చేసినా అది దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తిగా ఉండాలని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉభయ సభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కొత్త బిల్లును తీసుకువస్తోందన్నారు. 128వ సవరణ బిల్లు 2023 ప్రకారం సభలో మహిళలకు సీట్లు రిజర్వ్ చేయబడతాయన్నారు.