Page Loader
Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 
ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?

Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 

వ్రాసిన వారు Stalin
Sep 19, 2023
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ కొత్త భవనంలో జరిగిన తొలి సెషన్‍‌లో మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించనున్నారు. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది తమ బిల్లు అని చెప్పారు. దీంతో యూపీఏ హయాంలో తీసుకొచ్చిని మహిళా రిజర్వేషన్ బిల్లుకు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు తేడాలు ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ తేడాల గురించి ఒకసారి తెలుసుకుందాం.

మహిళ

మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి?

మహిళా రిజర్వేషన్ బిల్లు, రాజ్యాంగం 108వ సవరణ బిల్లు, 2008 ప్రకారం, చట్ట సభల్లోని మొత్తం సీట్ల సంఖ్యలో మూడింట ఒక వంతు (33%) మహిళలకు రిజర్వ్ చేయాలని సూచిస్తుంది. కొత్త బిల్లు 33% కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్‌లకు సబ్-రిజర్వేషన్‌ను కూడా ప్రతిపాదిస్తుంది. బిల్లు ప్రకారం, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా రిజర్వ్‌డ్ స్థానాలు కేటాయించబడతాయి. ప్రస్తుత ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి మరింత ఏకాభిప్రాయంతో బిల్లును తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

మహిళ

యూపీఏ వర్సెస్ ఎన్డీఏ బిల్లుల్లో తేడాలు!

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు తుది ముసాయిదా ఇంకా పూర్తిస్థాయిలో బయటకు రాలేదు. మోదీ ప్రభుత్వం రూపొందించిన బిల్లు, యూపీఏ హయాంలో తీసుకొచ్చిన బిల్లు కంటే మెరుగైనదని బీజేపీ నాయకులు చెబతున్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యసభ, శాసన మండలిలోనూ రిజర్వేషన్‌ను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, శాసనసభలకు మాత్రమే వర్తించేలా యూపీఏ బిల్లును రూపొందించారు. కొత్త బిల్లులో ఓబీసీ కమ్యూనిటీని కూడా కవర్ చేసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లలో మూడో వంతు మహిళలకు రిజర్వ్ చేయబడుతుందని గతంలో యూపీఏ బిల్లు పేర్కొంది. అందులో ఓబీసీలను కూడా చేర్చాలని ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు కోరాయి. కొత్త బిల్లులో ఓబీసీలను కూడా చేర్చినట్లు తెలుస్తోంది.

మహిళ

స్థానిక సంస్థల్లో కొనసాగుతున్న 33శాతం రిజర్వేషన్

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే 1989లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా రాజకీయంగా మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటిసారిగా ప్రతిపాదించారు. బిల్లు లోక్‌సభలో ఆమోదించబడినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది. 1992లో పీవీ నరసింహారావు రాజ్యాంగ సవరణ బిల్లులు 72, 73లను తిరిగి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు మూడింట ఒక వంతు (33%) రిజర్వ్ చేయబడింది. బిల్లు ఉభయ సభల్లో ఆమోదించారు. ఆ తర్వాత చట్టంగా మారింది. ప్రస్తుతం ఈ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కొనసాగుతోంది.