Pm Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దురుద్దేశం లేదు: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడం, నియోజకవర్గాల సంఖ్య పెంపు, పునర్విభజన లక్ష్యంగా మూడు కీలక బిల్లులను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని సభలో ప్రసంగిస్తూ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారికి తగిన పరిణామాలు తప్పవని విపక్షాలను హెచ్చరించారు.
వివరాలు
కానుక కాదు.. హక్కు
దేశ పార్లమెంట్ చరిత్రలో ఈ రోజు ప్రత్యేకమైనదని మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమని పేర్కొన్నారు.ఈ కీలక సమయంలో భాగస్వామి కావడం తన అదృష్టమన్నారు. ఈ బిల్లుల ద్వారా దేశానికి కొత్త దిశ,దశ లభిస్తుందని చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్ అంటే కేవలం రహదారులు, రైల్వేలు, మౌలిక వసతులు మాత్రమే కాకుండా మహిళల స్వావలంబన కూడా అవసరమని వివరించారు. దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, వారికి అవకాశం ఇస్తే దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఉందని చెప్పారు. రాజకీయాల్లో తమ ప్రతిభను చాటేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ మహిళలకు ఇచ్చే బహుమతి కాదని, అది వారి హక్కు అని స్పష్టం చేశారు.
వివరాలు
మద్దతిచ్చినవారికే భవిష్యత్తు
మహిళా రిజర్వేషన్ల కోసం గత 30 ఏళ్లుగా ప్రయత్నాలు జరిగినా అమలు కాలేదని మోదీ గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో అమలు చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. 2029 ఎన్నికలలోనూ అమలు చేయకపోతే మహిళలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ బిల్లుకు రాజకీయ ఉద్దేశం లేదని, ఇది పార్టీల కోసం కాదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరని హెచ్చరించారు. బిల్లును అడ్డుకునే పార్టీలకు ప్రజల తీర్పు తప్పదని చెప్పారు. మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే భవిష్యత్తు ఉంటుందని విపక్షాలపై విమర్శలు చేశారు.
వివరాలు
దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేదు
బిల్లు తీసుకురాగానే కొందరు ప్రాంతీయ భావజాలంతో మాట్లాడుతున్నారని మోదీ విమర్శించారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అలాంటి ఆలోచనలను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
వివరాలు
నాకు కీర్తి అవసరం లేదు
ఈ బిల్లుతో దేశ మహిళలకు వారి హక్కులు అందుతున్నాయని మోదీ అన్నారు. దీనికి కీర్తి తనకు అవసరం లేదని చెప్పారు. విపక్షాలే కీర్తి తీసుకోవాలని సూచించారు. మహిళా బిల్లుపై అన్ని పార్టీల నాయకుల పేర్లు ఉంచాలని కోరారు. బిల్లును అడ్డుకోకుండా సహకరించడం ద్వారా తమ గొప్పతనాన్ని చాటుకోవాలని విపక్షాలను కోరారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని పిలుపునిచ్చారు.