LOADING...
Andhra News : వండర్‌లా విశాఖకు.. ఇమాజికా వరల్డ్‌ తిరుపతికి

Andhra News : వండర్‌లా విశాఖకు.. ఇమాజికా వరల్డ్‌ తిరుపతికి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

పర్యాటక రంగమే ఏపీకి తొలి ప్రాధాన్య రంగమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దాని తర్వాత ఐటీ రంగానికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. 'ముందుగా బస చేసే సదుపాయాలు, ఆ తరువాత పని చేసే అవకాశాలు కల్పించాలి. అందుకే హోటళ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వడం పెద్ద గేమ్‌ ఛేంజర్‌గా మారుతుంది' అని సీఎం వ్యాఖ్యానించారు. కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ కీలక అంశాన్ని ప్రస్తావించారు. పర్యాటక ప్రాజెక్టుల కోసం భూమిని గుర్తించి పారిశ్రామికవేత్తలకు సమాచారం ఇచ్చిన అనంతరం, అదే భూమిని ఇతర శాఖలకు కేటాయించిన ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు.

వివరాలు 

వండర్‌లా ప్రాజెక్టుకు విశాఖలో 50 ఎకరాలు

ప్రాజెక్టు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖకు భూ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అజయ్‌ జైన్‌ కోరారు. దేశంలో పేరుగాంచిన వినోద కేంద్రాలైన వండర్‌లా అమ్యూజ్‌మెంట్‌ పార్కు విశాఖపట్నంలో, ఇమాజికా వరల్డ్‌ తిరుపతిలో ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. వండర్‌లా ప్రాజెక్టుకు విశాఖలో 50 ఎకరాలు, ఇమాజికా వరల్డ్‌కు తిరుపతిలో 20 ఎకరాల భూమి అవసరమని పేర్కొన్నారు. ఈ రెండు భారీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు.

వివరాలు 

పర్యాటక రంగంలో రూ.28,977 కోట్ల పెట్టుబడులు 

విశాఖపట్టణంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పర్యాటక శాఖకు సంబంధించి రూ.28,977 కోట్ల విలువైన 209 అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. వీటిలో రూ.11,092 కోట్ల పెట్టుబడులతో 66 ప్రతిపాదనలు రావడంతో విశాఖ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. రూ.5,321 కోట్ల విలువైన 27 ప్రతిపాదనలతో తిరుపతి రెండో స్థానంలో ఉంది. గుంటూరు జిల్లాకు (అమరావతితో కలిపి) రూ.3,960 కోట్ల పెట్టుబడులతో 17 ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రాజెక్టుల అమలుతో రాష్ట్రవ్యాప్తంగా 4,597 హోటల్‌ గదులు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

వివరాలు 

పర్యాటక రంగంలో రూ.28,977 కోట్ల పెట్టుబడులు 

వీటి ద్వారా 10,645 మందికి ప్రత్యక్షంగా, మరో 18,030 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అమరావతి ప్రాంతంలో (గుంటూరుతో కలిపి) రూ.884.59 కోట్ల వ్యయంతో 891 గదులతో 6 హోటళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అజయ్‌ జైన్‌ వివరించారు. ఈ హోటళ్ల ద్వారా 1,675 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయని ఆయన తెలిపారు.

Advertisement