Yadadri: సోమవారం నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా, భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ( మార్చి 11) నుంచి 11రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన అనంతరం ఇవి రెండోసారి జరగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం వేడుకలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇదిలా ఉంటే, వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను ఆలయ అధికారులు అందజేశారు. లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 5రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
18న రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుగుతాయి. మార్చి 11న స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలు ప్రారంభమై.. మార్చి 21న గర్భాలయంలోని మూలవరులకు సహస్ర కలశాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 18న రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని మాడవీధిలో జరపనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తలంబ్రాలు, వస్త్రాలను అందజేస్తారు. ఈ రోజునే సీఎం రేవంత్ రెడ్డి వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బ్రహ్మోత్సవాల్లో వల్ల సోమవారం నుంచి 21వ తేదీ వరకు సాధారణ ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.