Loading...
Yasin Malik: సర్లా భట్ హత్యతో సంబంధం లేదు.. తనకు మరణశిక్ష విధించాలన్న యాసిన్ మాలిక్
సర్లా భట్ హత్యతో సంబంధం లేదు.. తనకు మరణశిక్ష విధించాలన్న యాసిన్ మాలిక్

Yasin Malik: సర్లా భట్ హత్యతో సంబంధం లేదు.. తనకు మరణశిక్ష విధించాలన్న యాసిన్ మాలిక్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ సర్లా భట్ హత్య కేసులో కీలక నిర్ణయం తీసుకున్నారు. 1990లో జరిగిన కశ్మీరీ పండిట్ సర్లా భట్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో తాను న్యాయపోరాటం చేయబోనని చెబుతూ శ్రీనగర్‌లోని ప్రత్యేక కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. తనపై నమోదైన ఆరోపణల నేపథ్యంలో తనకు మరణశిక్ష విధించాలని అందులో కోరారు. ప్రస్తుతం యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ అఫిడవిట్‌లో మరో కీలక విషయాన్ని కూడా మాలిక్ వెల్లడించారు. తన భార్యతో ఉన్న వైవాహిక బంధాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు.

వివరాలు 

హత్య జరిగినప్పుడు తాను కోమాలో ఉన్నానని వాదన

1990 ఏప్రిల్‌లో సర్లా భట్ హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు సంస్థ ఈ ఏడాది జూన్‌లో యాసిన్ మాలిక్‌ను నిందితుడిగా పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

తనపై వచ్చిన ఆరోపణలను యాసిన్ మాలిక్ పూర్తిగా తోసిపుచ్చారు.

సర్లా భట్ హత్య జరిగిన సమయంలో తాను ఓ భవనం నుంచి కిందపడటంతో కోమాలో ఉన్నానని తెలిపారు.

అలాంటి పరిస్థితిలో హత్యకు ప్రణాళిక రూపొందించడం లేదా దానిలో పాల్గొనడం తనకు సాధ్యం కాదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

వివరాలు 

ఇది రాజకీయ ప్రేరేపిత కట్టుకథ అని ఆరోపణ

ఇదే సమయంలో ఈ కేసులో గతంలో తన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదని మాలిక్ వాదించారు.

ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం తనపై కట్టుకథలు సృష్టించి కేసులో ఇరికించారని ఆరోపించారు.

తనకు హత్యతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తూ, కేసును ఎదుర్కొనేందుకు న్యాయపోరాటం చేయడం కంటే తనకు మరణశిక్ష విధించాలని ప్రత్యేక కోర్టును కోరారు.

ADVERTISEMENT