వైకాపా ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు.. ఆస్పత్రిలో పలువురి పరామర్శ
హార్ట్ ఎటాక్.. ఈ మాట వింటే చాలు జనాల్లో గుండె ఆగినంత పనవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గుండెపోటు సంబంధిత కేసులు, వాటి వల్ల వచ్చే మరణాలు మరీ హెచ్చు మీరుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి ఎప్పుడు ఎలా గుండెపోటు వస్తుందో ఎవరికీ అంతుపట్టట్లేదు. 15 ఏళ్ల లోపున్న చిన్నారులు మొదలు ఏ వయసువారినైనా ఈ గుండె రోగం బారినపడుతుండటం కలవరానికి గురిచేస్తోంది. వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యారు. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన అశోక్ నగర్ లోని టాప్ స్టార్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమికంగా వైద్య చికిత్సలు అందించిన వైద్యులు, అనంతరం యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండెకు స్టంట్ వేశారు.
ఆస్పత్రికి చేరుకుంటున్న కార్యకర్తలు
ఈ నేపథ్యంలో పెనమలూరు శాసనసభ్యుడిగా కొనసాగుతున్న పార్థసారథి క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. తమ ఎమ్మెల్యేకి హార్ట్ స్ట్రోక్ అని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అనంతరం ఆయన్ని పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. కొలుసు పార్థసారిథి 2004 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ తరపున ఉయ్యూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచినప్పటికీ అదే ఏడాది మంత్రిగానూ పని చేశారు. అనంతరం 2009 ఎన్నికల్లోనూ గెలుపొందారు. అయితే 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2019 ఎన్నికల్లో పెనమలూరు ఎమ్మెల్యేగా భారీ గెలుపు పొందారు.