LOADING...
Telangana : ఏడాదంతా సాగుతోనే కూరగాయల లోటు నివారణ
ఏడాదంతా సాగుతోనే కూరగాయల లోటు నివారణ

Telangana : ఏడాదంతా సాగుతోనే కూరగాయల లోటు నివారణ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను పూర్తిగా నివారించాలంటే ఏడాది పొడవునా కూరగాయల సాగు జరిగేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అధికంగా వినియోగంలో ఉన్న కూరగాయల రకాల సాగుకు ప్రాధాన్యం ఇచ్చి రైతులను ప్రోత్సహించాలని పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కూరగాయల లోటు పరిస్థితి, సాగు అవకాశాలు, పరిమితులు వంటి అంశాలపై విశ్వవిద్యాలయం ఇటీవల సమగ్ర అధ్యయనం నిర్వహించి, తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సాగు విస్తరణకు అనుసరించాల్సిన చర్యలను కూడా అందులో ప్రతిపాదించింది.

వివరాలు 

రాష్ట్రంలో 12.68 లక్షల టన్నుల కొరత

రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు సంవత్సరానికి సుమారు 27.22 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతుండగా, ప్రస్తుతం సగటున 1.35 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఈ విస్తీర్ణం ద్వారా ఏడాదికి కేవలం 14.54 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే లభిస్తోంది. అంటే రాష్ట్రంలో 12.68 లక్షల టన్నుల కొరత నెలకొంది. ఈ లోటును పూడ్చుకోవడానికి సుమారు 56 శాతం వరకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల మార్కెట్‌లో ధరలు పెరిగి, వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెరగాలంటే కూరగాయల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. అన్ని కాలాల్లో సాగు జరిగే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.

వివరాలు 

శీతల గిడ్డంగులు, ఆధునిక నిల్వ సదుపాయాలతో మార్కెట్‌ యార్డుల సన్నద్ధం

ముఖ్యంగా టమాటా,వంకాయ,బెండకాయ,క్యారెట్‌,క్యాబేజీ,దోసకాయ,కాలీఫ్లవర్‌,ముల్లంగి,ఉల్లిపాయ, బంగాళాదుంప,ఆకుకూరలు,బీరకాయ,సొరకాయ,మిరపకాయ,కాకరకాయ,చిక్కుడు వంటి పంటల సాగును రెట్టింపు స్థాయికి చేర్చాలి. అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే, ఎక్కువ ఉత్పాదకత కలిగిన రకాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదనంగా, శీతల గిడ్డంగులు, ఆధునిక నిల్వ సదుపాయాలతో మార్కెట్‌ యార్డులను సన్నద్ధం చేయాలి. ఎగుమతులకు ఊతమివ్వడానికి శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో సమీకృత ప్యాక్‌హౌస్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నివేదికలో సూచించారు. ఈ చర్యలు అమలులోకి వస్తే రాష్ట్రంలో కూరగాయల కొరత తగ్గి, రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు వినియోగదారులకు కూడా ధరల నియంత్రణ సాధ్యమవుతుందని విశ్వవిద్యాలయం అభిప్రాయపడింది.

Advertisement