Loading...
Telangana : మార్చి నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
మార్చి నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ

Telangana : మార్చి నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) అధికారులు నిర్మాణ పనులకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. తొలుత రూపొందించిన ప్రణాళికలకు అదనంగా ఆధునిక సౌకర్యాలతో పరిపాలనా భవనం, తరగతి గదులు, విద్యార్థినీ విద్యార్థుల వసతిగృహాలు, ఆచార్యుల నివాసాలను నిర్మించనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.230 కోట్లు ఖర్చు చేయనున్నారు. పరిపాలనా భవనం, ప్రధాన ప్రవేశ ద్వారం కోసం ప్రత్యేకంగా డిజైన్లు రూపొందించారు.

వివరాలు 

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు వేదికగా వర్సిటీ

డిసెంబరు 7 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని వేదికగా ఎంపిక చేశారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నెల రోజుల క్రితమే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో సదస్సు ఏర్పాట్లతో పాటు యూనివర్సిటీ నిర్మాణ పనులను కూడా సమాంతరంగా వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

సదస్సులో వేర్వేరు కార్యక్రమాల నిర్వహణ కోసం పరిపాలనా భవనంతో పాటు తరగతి గదుల బ్లాక్‌లను ఉపయోగించనున్నారు.

ఒక్కో సమావేశానికి వందలాది మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో వేదికలు విశాలంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా యూనివర్సిటీ ప్రాంగణంలోని మైదానంలో ప్రదర్శనలు నిర్వహించేందుకు తాత్కాలిక నిర్మాణాలను చేపట్టనున్నారు.

వివరాలు 

నవంబరు 15లోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళిక

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు అవసరమైన నిర్మాణాలు, ఇతర ఏర్పాట్లను నవంబరు 15 నాటికి పూర్తి చేయాలని అధికారులు షెడ్యూల్ రూపొందించారు.

సదస్సు ఏర్పాట్లు పూర్తిచేస్తూనే యూనివర్సిటీకి సంబంధించిన మిగతా నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు.

మొత్తం మీద వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT