
Rajnath Singh:'మీ కోరిక.. నెరవేరుతుంది': భారత్-పాకిస్తాన్ యుద్ధంపై క్లారిటీ ఇచ్చిన రక్షణ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ ఘటనపై భారత్ కచ్చితంగా ప్రతీకారం తీసుకుంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు.
భారత్‌పై దాడులకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సైన్యంతో సమన్వయంగా పనిచేయడం తన బాధ్యతని ఆయన స్పష్టంగా తెలిపారు.
ఉగ్రవాదులకు సరిహద్దులవద్ద నుంచి సహాయం అందుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రజలు ఏం ఆశిస్తున్నారో అది ప్రధాని మోదీ నేతృత్వంలో ఖచ్చితంగా జరగుతుందని హామీ ఇచ్చారు.
ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు.
"ప్రధాని మోదీ నాయకత్వంలో మీరు కోరుకునేది తప్పకుండా నెరవేరుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వివరాలు
భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ
ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు భారత్ గట్టి హెచ్చరిక ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ముష్కర గుంపులు పర్యాటకులపై దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ దాడి వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందన్న అనుమానాలపై భారత్ ఘాటుగా స్పందిస్తోంది.
దీని పరిణామంగా పాకిస్థాన్ పౌరులకు వీసాలను రద్దు చేయడం, సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం వంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
అంతేకాక, ఈ దాడికి బదులుగా ఏ చర్యకైనా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడినట్టు తెలుస్తోంది.
వివరాలు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పలు మార్లు ఉల్లంఘించిన పాక్
"రక్షణ మంత్రిగా నా దేశాన్ని, సరిహద్దులను కాపాడడం నా ప్రధాన బాధ్యత.
మన దేశాన్ని ముప్పుపెట్టే వారికి తగిన సమాధానం ఇవ్వడానికి సైనికులతో కలిసి పనిచేయడమే నా కర్తవ్యం" అని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
పహల్గామ్ ఘటన అనంతరం భారత్ - పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ (LOC)పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని పలు మార్లు ఉల్లంఘించింది.
అయితే, భారత్ సైన్యం ఈ ఉల్లంఘనలకు సమర్థవంతంగా స్పందిస్తూ తగిన తిప్పికొట్టింది.
ఇక గతంలోనూ భారత్ ఉగ్రవాద దాడులకు తగిన బదులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
వివరాలు
పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు
ముఖ్యంగా ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది.
ఈ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడి ద్వారా 40 ఏళ్ల అనంతరం భారత సైన్యం తొలిసారిగా పాక్ భూభాగంలోకి ప్రవేశించింది.
అయితే, పాకిస్థాన్ మాత్రం అక్కడ ఎటువంటి ఉగ్రశిబిరాలు లేవని తప్పుడు వాదనలతో తప్పించుకునే ప్రయత్నం చేసింది.
ఇక 2016 సెప్టెంబరులో ఉరి సెక్టార్‌లో భారత సైనిక శిబిరంపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది.
ఇవన్నీ భారత్ ఉగ్రవాదంపై ఎలా కఠినంగా స్పందిస్తుందో స్పష్టంగా చూపిస్తున్న ఉదాహరణలు.