LOADING...
YS Jagan: అమరావతి చట్టబద్ధతపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు.. 'మావిగన్'గా కొత్త రాజధాని ప్లాన్ బీ ప్రతిపాదన
మావిగన్'గా కొత్త రాజధాని ప్లాన్ బీ ప్రతిపాదన

YS Jagan: అమరావతి చట్టబద్ధతపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు.. 'మావిగన్'గా కొత్త రాజధాని ప్లాన్ బీ ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే అంశంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధత కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు, అవసరమైతే అదే సభలో తిరిగి సవరణలు చేయడం సాధ్యమే కాదా అని ఆయన ప్రశ్నించారు. ఒకసారి తీర్మానం చేసినదాన్ని మళ్లీ మార్చుకోవడం అసాధ్యం అన్న భావన తప్పు అని స్పష్టం చేశారు. చట్టాల్లో మార్పులు చేయడం సాధారణ ప్రక్రియ అని, ఇది చిన్నపిల్లాడికైనా తెలిసిన విషయమని జగన్ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.

వివరాలు 

అమరావతి ప్రాజెక్ట్‌పై జగన్ తీవ్ర ఆరోపణలు

ఏ ప్రభుత్వం అయినా చట్టాలను రూపొందించే అధికారం కలిగి ఉంటుంది, అలాగే అవసరమైతే వాటిని సవరించే హక్కు కూడా ఉందని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ తమ పార్టీ వ్యతిరేకం కాదని, ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమని తెలిపారు. అమరావతి ప్రాజెక్ట్‌పై కూడా జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలోనే ఇది అతిపెద్ద స్కామ్‌గా మారిందని, అక్కడ వ్యవస్థబద్ధంగా అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. భారీ స్థాయిలో అవినీతి జరిగేందుకు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని ఆయన విమర్శించారు.

వివరాలు 

రాజధానికి 'ప్లాన్ బీ'గా జగన్ కొత్త ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో జగన్ మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను కలిపి కొత్త రాజధానిగా ప్రకటించాలని సూచించారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు సుమారు 110 కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మూడు ప్రాంతాల పేర్లలోని అక్షరాలను తీసుకుని కొత్త రాజధానికి 'మావిగన్ (MAVIGUN)' అనే పేరు పెట్టాలని సూచించారు. సుమారు రూ.2 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్ట్‌లో కేవలం 10 శాతం ఖర్చు చేసినా అభివృద్ధి సాధ్యమని జగన్ చెప్పారు. సముద్రానికి సమీపంగా ఉండటంతో ఈ ప్రాంతం చెన్నై, ముంబై నగరాల మాదిరిగా పోర్ట్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశముందని వివరించారు.

Advertisement