Loading...
Cancer drugs: క్యాన్సర్ రోగులకు ఊరట.. 137 రకాల మందుల ధరలు తగ్గింపు
క్యాన్సర్ రోగులకు ఊరట.. 137 రకాల మందుల ధరలు తగ్గింపు

Cancer drugs: క్యాన్సర్ రోగులకు ఊరట.. 137 రకాల మందుల ధరలు తగ్గింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్యాన్సర్ రోగులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 9, 2026 నుంచి దేశంలో 137రకాల క్యాన్సర్ మందుల ధరలు తగ్గనున్నాయి. ఈ మందులపై ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (టీఎంఆర్)విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనివల్ల ఎంపిక చేసిన క్యాన్సర్ మందుల ఎంఆర్‌పీ ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే 70శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మందుల పంపిణీ, విక్రయాల సమయంలో వ్యాపారులు పొందే మార్జిన్‌ను గరిష్ఠ చిల్లర ధరలో 30 శాతానికి పరిమితం చేయనున్నారు. పెంబ్రోలిజుమాబ్,దుర్వాలుమాబ్,ఒసిమెర్టినిబ్ వంటి క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులతో పాటు 20కి పైగా రకాల క్యాన్సర్ల చికిత్సకు వినియోగించే ఇమ్యునోథెరపీ మందులు ఈ జాబితాలో ఉన్నాయి.

వివరాలు 

క్యాన్సర్ మందుల ధరలపై నియంత్రణ.. గతంలో 90 శాతం వరకు తగ్గింపు

రొమ్ము,ప్రోస్టేట్,పెద్దపేగు,అండాశయ,గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు కూడా ఇందులో ఉన్నాయి.

ఎముకలకు సంబంధించిన సమస్యల చికిత్సలో ఉపయోగించే డెనోసుమాబ్,క్యాన్సర్ రోగుల్లో న్యూట్రోపీనియా సమస్యను నివారించేందుకు ఇచ్చే పెగ్‌ఫిల్గ్రాస్టిమ్,పెద్దపేగు,అండాశయ,గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే బెవాసిజుమాబ్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

అయితే, ప్రతి మందు ధర ఎంత తగ్గుతుందనేది దాని ప్రస్తుత ధర, పంపిణీదారులకు ఇచ్చే ధర ఆధారంగా మారుతుంది.

ధరల నియంత్రణ కోసం జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వులు-2013లోని 19వ పేరా ప్రకారం ఈ చర్యలు తీసుకుంది.

గతంలో 2019లో 42 రకాల క్యాన్సర్ మందులపై ధరల నియంత్రణ విధించగా, కొన్ని మందుల ధరలు 90 శాతం వరకు తగ్గాయి.

వివరాలు 

కొత్త ధరల అమలుపై కేంద్రం మార్గదర్శకాలు

తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల క్యాన్సర్ చికిత్స కోసం అధిక ఖర్చులు భరిస్తున్న రోగులు,వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.

తయారీ సంస్థలు గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన ఏడు రోజుల్లోగా సవరించిన ధరలను ఎన్‌పీపీఏకు తెలియజేయాలి.

కొత్త ధరల జాబితాలను తమ వెబ్‌సైట్లలో ఉంచడంతో పాటు మందుల దుకాణాలు, ఆసుపత్రులకు అందుబాటులో ఉంచాలి.

నవంబర్ 9 నుంచి మందుల దుకాణాలు, ఆసుపత్రులు తగ్గించిన ధరలకే మందులను విక్రయించాలి.

ఆసుపత్రులు తమ వెబ్‌సైట్లలోనూ సవరించిన ధరలను ప్రదర్శించాలి.

వినియోగదారులు మందుల తాజా ధరలను తెలుసుకునేందుకు 'ఫార్మా సహీ దామ్'యాప్‌తో పాటు ఎన్‌పీపీఏ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.

మందుల కొరత ఏర్పడకుండా తయారీ సంస్థలు ప్రస్తుతం కొనసాగుతున్న ఉత్పత్తి,సరఫరా స్థాయులను కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది.

ADVERTISEMENT