Loading...
Magical Plant : 2,000 ఏళ్లుగా కనిపించని 'మిరాకిల్ ప్లాంట్' మళ్లీ దొరికిందా?
2,000 ఏళ్లుగా కనిపించని 'మిరాకిల్ ప్లాంట్' మళ్లీ దొరికిందా?

Magical Plant : 2,000 ఏళ్లుగా కనిపించని 'మిరాకిల్ ప్లాంట్' మళ్లీ దొరికిందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుమారు 2,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిందని భావించిన ఓ పురాతన మొక్క మళ్లీ భూమిపై కనిపించిందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న పరిశోధకులకు టర్కీలోని హసన్ పర్వత ప్రాంతంలో ఓ అరుదైన మొక్క కనిపించింది. పురాతన గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్లు అనేక అనారోగ్యాలకు ఔషధంగా ఉపయోగించిన 'సిల్ఫియం' అనే మొక్కకు ఇది దగ్గర పోలికలు కలిగి ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అప్పట్లో ఈ మొక్కను గర్భనిరోధకంగా కూడా ఉపయోగించేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సిల్ఫియం లేదా సిల్ఫియాన్‌ అనే ఈ మొక్క వేల సంవత్సరాల క్రితం మధ్యధరా ప్రాంతంలో అత్యంత విలువైన మొక్కల్లో ఒకటిగా ఉండేది. దీని బంగారు రంగు పూలు, మందమైన కొమ్మలు, వేర్లను వివిధ రకాలుగా ఉపయోగించేవారు.

వివరాలు 

వెండితో సమానంగా మొక్క విలువ 

పురాతన కాలంలో ప్రజలు మొక్కను నూరి రసం తీసుకుని ఔషధంగా వాడేవారు.

అంతేకాదు, పూలను వంటల్లోనూ ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది.

అదే సమయంలో ఈ మొక్కకు గర్భనిరోధక లక్షణాలు ఉన్నాయని కూడా అప్పటి నమ్మకాలు, రికార్డులు సూచిస్తున్నాయి.

రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ కాలంలో సిల్ఫియం విలువ వెండితో సమానంగా ఉండేదట.

రోమన్లు ఈ మొక్కను ఎంత విలువైనదిగా భావించారంటే.. వెండితో పాటు బంగారం ఉన్న రాజ ఖజానాలో వెయ్యి కిలోలకుపైగా సిల్ఫియంను నిల్వ చేసినట్లు రికార్డులు ఉన్నాయి.

ఈ మొక్క మొదట లిబియాలోని సైరెనైకా తీర ప్రాంతంలో పెరిగేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

అయితే ఆ తర్వాత దాదాపు ఏడు శతాబ్దాల్లోనే అది మధ్యధరా ప్రాంతం నుంచి పూర్తిగా కనుమరుగైందని భావించారు.

వివరాలు 

క్రీ.శ. మొదటి శతాబ్దంలో చివరి రికార్డు

క్రీ.శ. మొదటి శతాబ్దంలో ఈ మొక్కకు సంబంధించిన చివరి రికార్డు నమోదైంది.

రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన 'నేచురల్ హిస్టరీ' గ్రంథంలో సిల్ఫియం గురించి ప్రస్తావించారు.

కేవలం ఒక్క కాడ మాత్రమే దొరికిందని, దానిని చక్రవర్తి నీరోకు అందించారని ఆయన రాశారు.

ఆ తర్వాత ఈ మొక్క కనిపించకపోవడంతో అది అంతరించిపోయిందనే అభిప్రాయం బలపడింది.

సిల్ఫియం కథలు తర్వాతి తరాల పరిశోధకులను, అన్వేషకులను కూడా ఆకర్షించాయి.

మధ్యయుగాల్లో మూడు ఖండాల్లో అన్వేషకులు ఈ మొక్క కోసం వెతికినా ఎక్కడా కనిపించలేదు.

దీంతో ఒక మొక్క అంతరించిపోయినట్లు నమోదైన తొలి ఘటనల్లో సిల్ఫియం ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది.

కాలక్రమంలో ఈ మొక్కకు సంబంధించిన కథలు కూడా మరుగునపడ్డాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఫెరులా డ్రూడియానాకు సిల్ఫియం పోలికలు

అయితే ఇప్పుడు టర్కీలోని ఇస్తాంబుల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహ్ముత్ మిస్కీ చేసిన పరిశోధనలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చాయి.

హసన్ పర్వతంపై పెరిగే 'ఫెరులా డ్రూడియానా' అనే మొక్కే పురాతన సిల్ఫియం అయి ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు.

పురాతన గ్రంథాల్లో సిల్ఫియం గురించి ఉన్న వివరాలు, ప్రాచీన గ్రీకు నాణేలపై కనిపించే మొక్క చిత్రాలతో ఫెరులా డ్రూడియానాకు పోలికలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

ముఖ్యంగా దాని మందమైన, అనేక శాఖలుగా విస్తరించే వేరు, పసుపు రంగు పూలు సిల్ఫియంతో పోలి ఉన్నాయని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

30 రకాల సెకండరీ మెటాబొలైట్లు

ఫెరులా డ్రూడియానాలో ఔషధ ప్రయోజనాలు కలిగిన అనేక రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని మిస్కీ చెబుతున్నారు.

ఇందులో క్యాన్సర్‌ నిరోధక, వాపు తగ్గించే లక్షణాలతో పాటు గర్భనిరోధక ప్రభావాలకు సంబంధించిన సమ్మేళనాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ మొక్క క్యారెట్‌, సోంపు, పార్స్లీ వంటి మొక్కలు ఉండే ఒకే కుటుంబానికి చెందినది.

పోస్ట్‌ డాక్టోరల్ పరిశోధన సమయంలో హసన్ పర్వతంపై తొలిసారి ఈ మొక్కను గుర్తించినట్లు మిస్కీ తెలిపారు.

ఇందులో సుమారు 30 రకాల సెకండరీ మెటాబొలైట్లు ఉన్నట్లు ఆయన గుర్తించారు.

వీటిలో కొన్ని వైద్యపరంగా ఉపయోగపడే లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పారు.

వివరాలు 

నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం

పర్వత ప్రాంత గొర్రెలు,మేకలు ఈ మొక్కను ఇష్టంగా మేస్తాయని చెప్పారని, పురాతన సిల్ఫియం విషయంలోనూ ఇదే విషయాన్ని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయని మిస్కీ తెలిపారు.

అయితే టర్కీలో లభించిన ఫెరులా డ్రూడియానానే పురాతన సిల్ఫియం అని నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం.

వేల ఏళ్లుగా మిస్టరీగా ఉన్న సిల్ఫియం నిజంగానే తిరిగి కనిపించిందా? లేక దానికి పోలికలు ఉన్న మరో మొక్కేనా? అనే ప్రశ్నలకు శాస్త్రీయ పరిశోధనలు పూర్తిస్థాయిలో సమాధానం చెప్పాల్సి ఉంది.

ADVERTISEMENT